iDreamPost
iDreamPost
విశాఖ నగరం పర్యాటకుల స్వర్గధామంగా ఎదగడం వెనుక ఎందరో మహానుభావుల కృషి ఉంది. ఒకప్పుడు జాలరి పల్లెగా ఉన్న విశాఖ డచ్ వారు, ఆంగ్లేయుల రాకతో అభివృద్ధికి శ్రీకారం చుట్టుకుంది.
సహజసిద్ధమైన.. అతి పొడవైన తీరా రేఖ, రక్షణ కవచం లాంటి డాల్ఫిన్ నోస్.. విశాఖకు భాగ్యరేఖగా మారాయి. ఆ క్రమంలో ఎదుగుతూ వచ్చిన ఆచిన్న ఊరు 1958లో మున్సిపాలిటీగా అవతరించింది.
పరిశ్రమల పుంత
స్వతంత్ర్యానంతరం విశాఖపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పడింది. దేశంలోనే తొలి నౌక నిర్మాణ కేంద్రాన్ని ఇక్కడే స్థాపించారు. సహజసిద్ధమైన ఓడరేవు విశాఖ పోర్ట్ ట్రస్ట్ గా అవతరించింది. దేశ తూర్పు తీరంలో పెట్టని కోటలా ఉన్న విశాఖలోనే తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాల్ టెక్స్ పేరుతో పెట్రోలియం శుద్ధి కర్మాగారం (నేటి హెచ్పీసీఎల్) ఏర్పాటైంది. ఇంకా అనేక పరిశ్రమల రాకతో జనాభా పెరుగుదల.. కొత్త ప్రాంతాలకు పట్టణం విస్తరించడం వేగం పుంజుకుంది. 1901లో 40,892 ఉన్న జనాభా 1979 నాటికి 8 లక్షలకు పెరిగింది. దాంతో మున్సిపాలిటీలో కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలను విలీనం చేసి 1979లో 50 డివిజన్లతో నగర పాలక సంస్థ హోదా కల్పించారు.
గ్రేటర్ హోదా
ఆ తర్వాత కూడా నగరాభివృద్ధి మరింత వేగం పుంజుకుంది. స్టీల్ ప్లాంట్, సెజ్ లు, ఫార్మాసిటీ, ఐటీ పరిశ్రమ, వంటి వాటి రాకతో 2005లో మహావిశాఖ నగర పాలక సంస్థ గా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. నగరాన్ని కేంద్రం జాతీయ పట్టణాభివృద్ధి పథకంలో చేర్చడంతో నగరం రూపురేఖలు మారిపోయాయి. 2011 నాటికి 20 లక్షల జనాభా 78 డివిజన్లకు పెరిగింది. ప్రస్తుతం జనాభా సుమారు 25 లక్షలకు పెరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏకైక పెద్ద నగరంగా ఉన్న విశాఖకు మెట్రో హోదా కల్పిస్తూ పక్కనున్న అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను విలీనం చేసి డివిజన్లకు 98గా పునర్విభజించారు.
ఐదుగురు మేయర్లు
1979లో నగరపాలక సంస్థ అయిన విశాఖలో 1981 లో జరిగిన ఎన్నికలతో మేయర్ వ్యవస్థ ప్రారంభమైంది. 2007 వరకు జరిగిన ఐదు ఎన్నికల ద్వారా ఐదుగురు మేయర్లు విశాఖ పాలన పగ్గాలు చేపట్టారు. బీజేపీ, టీడీపీలు చెరోసారి, కాంగ్రెస్ మూడుసార్లు పాలకవర్గాలను ఏర్పాటు చేశాయి.
తొలి మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి
1981లో తొలిసారి జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో నెగ్గడం ద్వారా బీజేపీ తొలి పాలకపక్షంగా నిలిచింది. ఆ పార్టీ నేత ఎన్ ఎస్ ఎన్ రెడ్డి తొలి మేయర్ అయిన ఘనత సాధించారు. ఆనాడున్న పరోక్ష ఎన్నికల విధానంలో ప్రతిఏటా కార్పొరేటర్లు మేయర్ ను ఎన్నుకోవాల్సి ఉండేది. ఎన్ ఎస్ ఎన్ రెడ్డి వరుసగా ఐదేళ్లు మేయర్ గా ఎన్నికవ్వడం విశేషం. 1986 వరకు ఆ పదవిలో ఉన్న ఆయన నగరంలో మౌలిక వసతుల మెరుగుకు కృషి చేశారు.
డీవీతో నవీన విశాఖ
ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావు 1987లో ప్రత్యక్ష పద్దతిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి నగర రెండో మేయర్ గా 1992 వరకు వ్యవహరించారు. ఈయన హయాంలోనే నగరం ఆధునికత సంతరించుకుంది. వందలాది మురికివాడలు ఆధివృద్ధికి నోచుకున్నాయి. నగర నీటి అవసరాలు తీర్చే మేఘాద్రిగెడ్డ పైప్ లైన్ పనులు జరిగాయి.
సబ్బంతో కాంగ్రెస్ బోణీ
1995 ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ తొలిసారి నగరపాలన పగ్గాలు చేజిక్కించుకుంది. మేయర్ గా ఎన్నికైన సబ్బం హరి హయాంలో యూజీడీ పనులు ప్రారంభమయ్యాయి.
తొలి మహిళా మేయర్ రమణి
2000లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ విజయం సాధించగా.. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రాజాన రమణి విజయం సాధించి విశాఖ తొలి మహిళా మేయర్ అయ్యారు. 2005 వరకు ఉన్న ఆమె హయాంలో నగర పౌర, పారిశ్రామిక అవసరాలు తీర్చే నీటి పథకం (విస్కో) రూపుదాల్చింది. నగరపాలక సంస్థ పాఠశాలల్లో తొలిసారి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టారు.
మూడోసారీ కాంగ్రెస్
వైఎస్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు 2007లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. పులుసు జనార్ధనరావు మేయర్ పీఠం అధిష్టించి 2012 వరకు కొనసాగారు. ఈయన పాలన కాలంలో నగర శివార్లలోని విలీన ప్రాంతాల ప్రగతిపై దృష్టి సారించారు. విశాఖ మ్యూజియం, కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం వంటివి ఏర్పాటయ్యాయి.
తొలిసారి వైస్సార్సీపీ
గ్రేటర్ హోదా, మెట్రో పేరు పొందిన విశాఖకు ఏడోసారి ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన వైస్సార్సీపీ తొలిసారి పాలన పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ కార్పొరేటర్ గోళగాని వెంకట హరికుమారి మేయర్ గా ఎన్నికయ్యారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినందున.. ఆ పార్టీ హయాంలో నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందన్న ఆశాభావం స్థానికుల్లో ఉంది.