iDreamPost
android-app
ios-app

వాయిస్ ఆఫ్ విశాఖ : ఫ‌లిస్తున్న ఎంపీల పోరాటం

వాయిస్ ఆఫ్ విశాఖ : ఫ‌లిస్తున్న ఎంపీల పోరాటం

అన్ని ప్రాంతాల స‌మ‌గ్రాభివృద్ధిలో భాగంగా ఏపీ ప్ర‌భుత్వం ఏళ్ల త‌ర‌బ‌డి వెన‌క‌బాటుకు గురైన ఉత్త‌రాంధ్ర పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టింది. విశాఖ‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ‌డం ద్వారా దాని అనుబంధంగా ఉన్న ఇత‌ర జిల్లాలకు కూడా మేలు క‌లుగుతుంద‌ని భావిస్తోంది. దానిలో భాగంగా విశాఖ అభివృద్ధి అన్ని ర‌కాలుగానూ యోచిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నుల‌న్నీ చేస్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విధుల‌పై కూడా ఫోకస్ పెట్టింది. వాటి కోసం రాజ్య‌స‌భ వేదిక‌గా ఏపీ ఎంపీలు గొంతెత్తుతున్నారు. విశాఖ అభివృద్ధితో పాటు, పలు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు అంశం, సమస్యల పరిష్కారానికి గ‌ళ‌మెత్తుతున్నారు.

ఉత్త‌రాంధ్ర అభివృద్ధి ప్ర‌స్తావ‌న‌

ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నంలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్య‌స‌భ‌లో విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. హోమియోపతి సెంట్రల్‌ కౌన్సిల్, ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విజయవాడలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా కేంద్రం ఉన్నందున విశాఖలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు అంత్యంత అవసరమన్నారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 పడకల ఆయుష్‌ ఆస్పత్రి నిర్మాణ పరిస్థితిపై కూడా ప్రస్తావించారు. నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో 4200 ఆయుష్‌ హెల్త్, వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించగా.. అందులో ఏపీలో ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.

కేంద్రం నుంచి సానుకూల ప‌వ‌నాలు

విశాఖకు రావాల్సిన, కావాల్సిన ప్రాజెక్టులు, అంశాలను సంబంధిత మంత్రుల దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకువస్తున్నారు. రెండు రోజుల క్రితమే విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. ప్రధానంగా విశాఖ నుంచి పర్యాటక ప్రాంతమైన అరకుకు నడుస్తున్న రైలులో కోచ్‌లు పెంచాల్సిన అవసరం ఉందని, తద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆయనతో అంగీకారం వచ్చేలా చేశారు. అదే విధంగా విశాఖ నుంచి తిరుమలకు, విశాఖ నుంచి హైదరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని చేసిన విన్నపానికి కూడా రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సానుకూల స్పందన లభించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల ఏర్పాటు విషయంపై రాజ్యసభ ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.