iDreamPost
android-app
ios-app

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారట.. కానీ..?

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారట.. కానీ..?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు రాజీనామాల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో.. శ్రీకాకుళం ఎంపీ ఈ ప్రతిపాదన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తామని రామోహన్‌నాయుడు ప్రకటించారు. అయితే అందుకు ఆయన ఓ షరతు విధించారు. అధికార పార్టీ వైసీపీ నాయకత్వం వహించి.. ఆ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేస్తే తాము కూడా చేస్తామంటూ మెలిక పెట్టారు. ఇలాంటి మెలిక పెట్టిన రామోహన్‌నాయుడు.. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంలో టీడీపీ చిత్తశుద్ధి ఏమిటో తెలియజేస్తున్నారు.

హోదా విషయంలో వైసీపీ అలా..

రాష్ట్ర విభజన సమయంలో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో హామీ ఇచ్చింది. ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ హామీని అటకెక్కించింది. రాజధాని, పరిశ్రమలు లేని ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే.. పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పోరాటాలు చేసింది. చివరి అస్త్రంగా ఎంపీలు 2018లో రాజీనామాలు చేశారు. దాదాపు ఒకటిన్నర ఏడాది పదవీ కాలం ఉన్నా.. ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే తాము చేస్తామనే చిత్రమైన, అమలు కాని ప్రతిపాదనను నాడు వైసీపీ పెట్టలేదు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని ప్రజలు విశ్వసించారు. అంతిమంగా 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు.

Also Read : ఆళ్లగడ్డలో పాత గొడవలు మళ్లీరేగుతున్నాయా?

మంచి అవకాశం ఎందుకు వదులుకుంటున్నారు..?

ఉత్తరాంధ్ర టీడీపీకి బలమైన ప్రాంతం. అయితే చంద్రబాబు హామీలు అమలు చేయకపోవడం, అరచేతిలో వైకుంఠం చూపించే పాలన సాగించడంతో 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. 25 ఎంపీలకు గాను మూడు ఎంపీ సీట్లను గెలిస్తే ఒకటి ఉత్తరాంధ్రలోనిది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 34 ఎమ్మెల్యే సీట్లు ఉండగా.. టీడీపీ కేవలం ఆరు సీట్లలోనే విజయం సాధించింది. అందులో నాలుగు విశాఖ సిటీలోనివే.

ఉత్తరాంధ్రలో చతికిలపడిన పార్టీని తిరిగి నిలుపుకునేందుకు టీడీపీ నేతలకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రూపంలో మంచి అవకాశం లభించింది. స్టీల్‌ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు అవినాభావ సంబంధం పేనవేసుకుని ఉంది. ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకుని ఉద్యమాలు చేస్తే టీడీపీకి మించి మైలేజ్‌ వస్తుంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలోనే ప్లాంట్‌పై మాట్లాడి.. రాజీనామాలు చేస్తే ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటూ.. వైసీపీ చేస్తే తాము రాజీనామాలు చేస్తామనేలా కింజారపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడడం వల్ల వచ్చే లాభం కన్నా.. నష్టమే ఎక్కువ. ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేసి ఆ క్రెడిట్‌ మొత్తం టీడీపీనే తీసుకోవచ్చు.

Also Read : కొడుకుకు కుప్పం ఇచ్చి తండ్రి త్యాగం చేయ‌నున్నారా?