భారత క్రికెట్ చరిత్రలో మరో మార్పు. ఈ సారి అంతా ఉహించిందే. టీ20 క్రికెట్ ఫార్మాట్‌కు భారత కెప్టెన్‌గా తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.బ్యాటింగ్‌లో మరింత రాణించడానికి కొన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తోంది అని, గత మూడు నాలుగు సంవత్సరాలుగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగిన ప్రయాణం ముగిసింది అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత దుబాయ్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించాడు.
నిజానికి కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని మొదటి నుంచి ఊహాగానాలు ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ తర్వాత మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ జట్టును ముందుకు నడిపించడంలో తన దూకుడైన స్వభావాన్ని ఎక్కడా తగ్గించుకో లేదు. మైదానంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ఉంటాడో స్టాండ్స్ లో మన టీం సభ్యులను ఉత్సాహ పరచడం లోనూ కోహ్లీ ముందుంటాడు. కూల్ కెప్టెన్‌గా పేరు పొందిన ధోనీ తర్వాత జట్టును ఎలా ముందుకు నడిపించగలడు అన్న అంచనాలను కోహ్లీ చాలా వరకు అందుకోగలిగాడు. 2017 నుంచి మూడు ఫార్మాట్లలోనూ ఇండియన్ టీమ్ ను ముందుకు నడిపించడంలోనూ తన మార్కు వేసుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత వారసుడిగా రంగంలోకి దిగిన కోహ్లీకి ఒకేసారి అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అవకాశం రాలేదు. ధోని రిటైర్మెంట్ తీసుకున్నాక ఒక్కొక్క ఫార్మాట్‌లో కోహ్లీనీ బీసీసీఐ నియమిస్తూ వచ్చింది. 2017 కు వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఐపీఎల్ ఫార్మాట్లోనే తాను పాల్గొంటానని టీ20 ఫార్మాట్ కు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించడంతో అప్పటికే వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. దాని తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు గెలుచుకుంది.
8, 9 ఏళ్ల నుంచి పూర్తిస్థాయి బ్యాట్స్మెన్ గా అన్ని ఫార్మాట్లలోనూ చాలా బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటారని ముందుగానే అంతా భావించారు. అందులోనూ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలోనూ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలం కావడంతో ఫాన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు కలిపి మొత్తం 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించాడు అని అంతా అనుకున్నారు.
అయితే విరాట్ కోహ్లీ 2019 ఆగస్టు లో చివరి సెంచరీ వెస్టిండీస్ మీద చేశాడు. తర్వాత మళ్లీ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో హాఫ్ సెంచరీలు చేసేందుకు కూడా చాలా తడబడ్డాడు. దీంతో అతడి ఆట మీద చాలా మందికి నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. బ్యాటింగ్ తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ టి20 కెప్టెన్సీ వదులుకొని పూర్తిగా బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దీనిపై కోచ్ రవిశాస్త్రితో పూర్తిగా మాట్లాడిన తర్వాతే కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
కోహ్లీ తర్వాత టి-20లో భారత జట్టును నడిపించగలిగిన సీనియర్ రోహిత్ శర్మ అన్నదే అందరి అభిప్రాయం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ కు మంచి విజయాలు అందించిన రోహిత్ శర్మ టి20 కెప్టెన్‌గా సరిగ్గా సరిపోతాడని అందరూ భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే విరాట్ కోహ్లీ సైతం తన ట్విట్‌లో రోహిత్ శర్మ పేరును సైతం ప్రస్తావించి తర్వాత కెప్టెన్ అతడే అనే సిగ్నల్స్ ను కూడా పంపించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సుమారు 36 టీ ట్వంటీలు ఆడిన భారత దేశం మంచి విజయాలను దక్కించుకుంది. అయితే ఇప్పుడు సరిగ్గా టి20 వరల్డ్ కప్ ముంగిట కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ భావించడం జట్టు ఆత్మస్థైర్యాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేసేదే.. అయితే తమ అభిమాన కెప్టెన్‌కు వరల్డ్ కప్ గెలిచి బహుమతిగా ఇచ్చి కెప్టెన్‌గా తుది వీడ్కోలు పలకాలని అందరి అభిలాష.