iDreamPost
iDreamPost
వెరీ ఇంపార్టెంట్ పర్సన్ (వీఐపీ) ఈ హోదాలో ఉన్నవారిని చూస్తే అబ్బ హోదా ఏం ఎంజాయ్ చేస్తున్నార్రా అన్నట్లు ఉంటుంది. కానీ వారి స్థానం నుంచి చూస్తే మాత్రం అక్కడెన్ని ఇబ్బందులున్నాయో అర్ధమవుతుంది. ఇటువంటి వీఐపీలు తమతమ విధి నిర్వహణకు ఆటంకాల్లేంకుండా ప్రత్యేక అనుమతుల కోసం వీఐపీ స్టిక్కర్లను ఇచ్చే విధానాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం 5 స్టిక్కర్ల వరకు జారీ చేస్తుంది. జారీ చేసిన తరువాత వీటి వినియోగం సక్రమంగా ఉందా? లేదా? అన్నది పరిశీలించేందుకు ఎటువంటి ప్రయత్నం జరగడం లేదు.
దీంతో సదరు వీఐపీలతో అత్యంత చనువుగా ఉండేవారు కూడా ఈ వీఐపీ స్టిక్కర్లును పోలిన స్టిక్కర్లను తమతమ వాహనాలకు అంటించుకుని హడావిడి చేయడం తరచు జరుగుతోంది. వీటిని పర్యవేక్షించి, నిరోధించేందుకు యంత్రాంగా సాహసం చేయకపోవడం ఈ తప్పుడు స్టిక్కర్ల కారణంగా అసలు వీఐపీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన స్టిక్కర్‌తో ఉన్న కారు నగదుతో పట్టుబడింది. దీంతో సదరు డబ్బు మంత్రిదేనని వ్యతిరేక వర్గం మైకందుకుంది. మీడియా, సోషల్ మీడియా.. ఇలా ప్రచారానికి అవకాశం ఉన్న అన్నిచోట్లా ఈ విషయం విపరీతమైన ప్రచారం పొందింది. అయితే సదరు స్టిక్కర్ డూప్లికేట్ అని పోలీస్‌లు తేల్చారు. దీంతో ఎవరి మైక్‌ను వారు సర్దుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మంత్రి ‘స్టిక్కర్’కు జరిగినంత పబ్లిసిటీ అది డూప్లికేట్ అన్నదానికి జరక్కపోవడం ఇక్కడ గమనార్హం. అయితే ఈ బురద మీదపడ్డ మంత్రి బాలినేని దానిని కడుక్కునేందుకు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి వీఐపీలకు ఇచ్చిన స్టిక్కర్లు ఎన్ని?, వినియోగంలో ఉన్నవి ఎన్ని? అన్నదానికి సమాధానం ప్రభుత్వంలోని ఏ యంత్రాంగం వద్దా లభించదు. ఇప్పటికిప్పుడు పెద్దగా ఎవ్వరికీ నష్టం లేని అనేక వ్యవహారాలు నడుస్తున్నట్లే ఈ స్టిక్కర్ల వ్యవహారం కూడా సాగుతోందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ స్టిక్కర్లు దుర్వినియోగం గురించి పలు మార్లు వార్తలు వెలువడ్డప్పటికీ వాటికి ప్రత్యామ్నాయాన్ని చూపించేందుకు మాత్రం ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ఒక్కోసారి తీవ్రమైన నేరాల్లో కూడా ఈ స్టిక్కర్లు ఉన్న వాహనాలు ఉంటుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకొందరైతే ఎందుకైనా మంచిదని సదరు స్టిక్కర్‌ను వాహనం నుంచి తొలగించి కేసు దర్యాప్తును ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటికీ పలు నకిలీ స్టిక్కర్లు రోడ్లమీద యధేచ్ఛగానే తిరుగుతూ ఉన్నాయి. పాలనలో వినూత్నమైన మార్పులతో తనదైన మార్పును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న సీయం వైఎస్ జగన్ ఈ స్టిక్కర్ల వ్యవహారం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.