Idream media
Idream media
విశాఖలో జరిగిన భూ కుంభకోణాలు, భూ దందాలపై ప్రభుత్వం నియమించిన సిట్‌తో అవినీతికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. భూ కుంభకోణాల్లో నష్టపోయిన, భూములు కోల్పోయిన బాధితులకు త్వరలో న్యాయం జరుగుతుందన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పలు వార్డుల్లో రోడ్లు, వంతెనలు, కాలువల నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో పుష్కలంగా ప్రాజెక్టులు నిండాయని, నాలుగు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయని, ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. చెప్పిన దాని కన్నా ముందే.. చెప్పిన దాని కంటే ఎక్కువగా రైతులకు భరోసా అందిందన్నారు. బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నింటికీ నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు చట్టం కూడా చేశామన్నారు.
రానున్న నాలుగున్నరేళ్లలో 25 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలుస్తుందన్నారు. ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ప్రస్తుతం ఒక కులానికి లబ్ధి చేకూర్చేందుకే పాకులాడుతున్నారని ఆరోపించారు.