iDreamPost
android-app
ios-app

విజ‌య‌వాడ‌ వాసుల కలసాకారం…

విజ‌య‌వాడ‌ వాసుల కలసాకారం…

ఒంపుసొంపుల‌తో.. తెలుపు న‌లుపు రంగుల‌తో.. అంద‌మైన వ్యూతో కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫ్లై ఓవ‌ర్ విజ‌య‌వాడ‌లో రూపుదిద్దుకున్న‌దే. బెజవాడ దుర్గమ్మకు వడ్డానం తరహాలో ఆక‌ట్టుకునేలా ఈ ఫ్లై ఓవర్ కనువిందు చేయ‌నుంది. మరో మూడు వారాల్లో ఇది అందుబాటులోకి రానుంది. బెజవాడ వాసుల చిరకాల కల వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా సాకారం కాబోతోంది. దశాబ్దకాలం విజయవాడ వాసుల ఎదురుచూపులు, ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. ఎట్టకేలకు దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఏపీ నడిబొడ్డున ఉన్న విజయవాడకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దుర్గగుడికి భక్తుల రద్దీతో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. దశాబ్దకాలం క్రితం ట్రాఫిక్ కష్టాలు వేధిస్తున్నాయి. ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌స్తే స‌మ‌స్య‌లు తీర‌నున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఫ్లైఓవర్ ‘లోడ్‌ టెస్ట్‌’ నిమిత్తం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

20న ట్ర‌య‌ల్ ర‌న్..

కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం 98 శాతం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 20 తర్వాత ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అంతకు ముందుగా ‘లోడ్‌ టెస్ట్‌’ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 48 గంటల పాటు లోడ్‌ టెస్ట్‌ను కొనసాగించనున్నారు. 24 లారీల్లో ఇసుక/ కాంక్రీటును నింపుతారు. ఒక్కో లారీపై 28.5 టన్నుల చొప్పున మొత్తం 684 టన్నుల బరువును వంతెనపై స్పాన్ల మధ్య ఉంచుతారు. 48 గంటల తర్వాత ఏమైనా లోపాలు కనిపిస్తే సరిచేస్తారు. సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక ఈనెల 20 తర్వాత ట్రయల్‌ రన్‌లో భాగంగా వాహనాలను అనుమతిస్తామని ఆర్‌ అండ్‌ బీ (క్వాలిటీ కంట్రోల్‌) సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ జాన్‌ మోషే తెలిపారు.