Idream media
Idream media
తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు నోట… ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పట్టణమైన విజయవాడ మాట.. అదొక ముఖ్యమైన కేంద్రమని వెల్లడి ఎందుకంటే.. సోమవారం మంత్రి కేటీఆర్ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కొత్తగా ఏర్పడిన రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ – విజయవాడ మధ్య హైస్పీడు రైలు ప్రస్తావన తెచ్చారు. ప్రస్తుతం ఖాజీపేట మీదుగా విజయవాడకు రైలు మార్గం ఉన్నా.. అది ఎక్కువ సమయం ఉండడం, అందరికీ అందుబాటులో లేదని చెబుతూ.. హైవే మార్గం ద్వారా ఓ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాలకు చాలా ఉపయోగకరం అని చెప్పారు. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు మంచి ప్రాజెక్టు అవుతుందని సూచించారు. ఈ విషయమైన తాను పార్లమెంట్ లో కూడా ప్రస్తావించానని చెప్పారు.
దీనికి స్పందనగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. అలాగే హైదరాబాద్ ముఖ్యమైన మెట్రో పాలిటన్ నగరమని రెండు ప్రాంతాల మధ్య బుల్లెట్ లేదా సూఫర్ ఫాస్ట్ రైలు అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు.
హైదరాబాద్ – విజయవాడ మధ్య ఆ రైలు అందుబాటులోకి వస్తే…
రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్ చాలా ప్రాధాన్యత గల పట్టణాలు. ఆయా ప్రాంతాల మధ్య వ్యాపార, ఉద్యోగ, కుటుంబ కార్యకాలాపాల నిమిత్తం రోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వందలాది బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నా.. అవి ఎప్పుడూ హౌస్ ఫుల్ గానే ఉంటాయి. ఇంతలా డిమాండ్ ఉన్న ఆ ప్రాంతాల మధ్య హై స్పీడ్, లేదా బుల్లెట్ రైలు ప్రస్తావన ప్రాముఖ్యత సంతరించుకుంది. సూర్యాపేట, నార్కట్ పల్లి, చిట్యాల, నకిరేకల్, కోదాడ, జగ్గయ్యపే మీదుగా విజయవాడ కలుపుతూ ఈ రైలు మార్గానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న మార్గాన్ని ఉపయోగించుకుని చిట్యాల నుంచి జగ్గయ్య పేట వరకూ 100 కిలోమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేసుకుంటే… ఈ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ది మరింత వేగవంతం అవుతుంది. ఇప్పటికే ముంబై – అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలుకు ప్రాజెక్టు ను మంజూరు చేసింది. అది 2023 వరకు పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ – విజయవాడ మధ్య హైస్పీడు రైలు ప్రస్తావన ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేందుకు కొంత సమయం పట్టక తప్పదు.