iDreamPost
android-app
ios-app

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ : ‌టీడీపీ ప‌రేషాన్..!

విజ‌య‌వాడ  కార్పొరేష‌న్ : ‌టీడీపీ ప‌రేషాన్..!

తెలుగుదేశానికి రాష్ట్రం అంతా ఓ లెక్క‌.. విజ‌య‌వాడ ఓ లెక్క కింద మారింది. అవును. అగత ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత టీడీపీ నిస్తేజంగా మారింది. కేడ‌ర్ కూడా పార్టీకి దూర‌మైంది. పోనీ అమ‌రావ‌తి ప‌రిస‌ర జిల్లాల్లో అయినా ప‌ట్టు నిలుపుకుందా అంటే అదీ లేద‌ని పంచాయ‌తీ ఎన్నిక‌లు తెలియ‌జేశాయి.

గుంటూరు జిల్లాలో 973 పంచాయ‌తీల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా వైసీపీ 761 చోట్ల విజ‌య దుందుభి మోగించింది. తెలుగుదేశం కేవ‌లం 177 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. కృష్ణా జిల్లాలో 957 పంచాయ‌తీల‌కు గాను వైసీపీ 700 చోట్ల గెలుపొంద‌గా, టీడీపీ మ‌ద్ద‌తుదారులు 175 స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించారు. అందులోనూ 71 చోట్ల అత్య‌ధిక మెజార్టీతో గెలిచారు. అమ‌రావ‌తిని త‌ల‌కెక్కించుకుని చాలా ప్రాంతాల‌ను న‌ష్ట‌పోయిన టీడీపీ కి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ప‌రాభ‌వం ఎదురుకావ‌డం తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. ఇంత‌లో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సైర‌న్ మోగింది. ఈ క్ర‌మంలో స్థానిక నేత‌ల మ‌ధ్య చిచ్చు రేగింది. ఎన్నిక‌ల్లో ఆధిపత్యం కోసం బ‌హిరంగ ర‌చ్చ‌కు దిగుతుండ‌డంతో కేడ‌ర్ అయోమ‌యానికి గుర‌వుతోంది.

నాడు ఆ పార్టీదే హ‌వా…

విజయవాడ బ్రిటీష్ హయాంలో 1888 ఏప్రిల్ 1న పురపాలక సంఘంగా ఏర్పడగా, 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా లభించింది. 1981లో నగర పాలక సంస్థగా ఏర్పడింది. 2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ విజయవాడ (మెట్రో) ఏర్పాటు చేసింది.మెట్రోనగరంలో విజయవాడ నగరపాలకసంస్థతో పాటు కలిసిపోయిన అంబాపురం, బుద్దవరం, దోనేటికూరు, ఎనికేపాడు, గంగూరు, గన్నవరం, గొల్లపూడి గ్రామాలు, మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, జక్కంపూడి, కానూరు, కీసరపల్లి, నిడమానూరు, నున్న, పాతపాడు, పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, పోరంకి, ప్రసాదంపాడు, రామవరప్పాడు, తాడిగడప, యనమలకుదురు ఉన్నాయి.

విజయవాడ నగరం పాల‌నా బాధ్య‌తాల‌న్నీ కార్పొరేష‌నే చూసుకుంటుంది. ఈ కార్పొరేష‌న్ లో 59 వార్డులు ఉన్నాయి. 2014 మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. గత ఏడాది వరకూ మేయర్‌గా కోనేరు శ్రీధర్ బాధ్యతలు నిర్వహించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి విజయవాడలో బ‌ల‌మైన పునాది ఉంది. వైసీపీ హోరు గాలిలోనూ గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో విజయవాడ స్థానం టీడీపీ అభ్య‌ర్థినే వ‌రించింది. అయితే రెండేళ్ల కాలంలో అక్క‌డ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది.

అదంతా భ్ర‌మే…

రాజధాని తరలింపు అంశం వల్ల విజయవాడ వాసుల్లో వైసీపీ మీద వ్యతిరేకత పెరిగింద‌ని, అది తమకు ఉపయోగపడుతుందని భావించిన‌ టీడీపీ నేతలకు అదంతా భ్ర‌మేన‌ని తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌తో తెలిసి వ‌చ్చింది. దీంతో కార్పొరేష‌న్ లో అయినా ప‌ట్టు సాధించాల‌ని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఆదేశాలు జారీ చేసినా, ఆపార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో తలోదారి అన్నట్టుగా సాగుతున్నారు.

ఎంపీగా ఉన్న కేశినేని నాని నగర రాజకీయాల్లో కూడా తన హవా ప్రదర్శించాలని చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా కుమార్తెకు మేయర్ పీఠం ఆశిస్తున్నారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా ఉత్సాహంగా నగరంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కార్పొరేటర్‌గా గెలిస్తే మేయర్ అవకాశం తనదేననే ధీమాతో ఉన్నారు. అందులో భాగంగా 39వ డివిజన్‌కి తమ వర్గీయుడైన శివవర్మని అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన టీడీపీ నేత కుమార్తె గుండారపు పూజితకు అక్కడ అవకాశం ఇవ్వాలని బుద్ధా వెంకన్న వంటి వారు వాదించారు. అది టీడీపీలో విభేదాలకు తావిచ్చిందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా వంటి వారు మాత్రమే కాకుండా బోండా ఉమా కూడా మేయర్ సీటు విషయంలో పలు ఇతర పేర్లు ప్రతిపాదిస్తున్న‌ట్లు తెలిసింది. ఇది టీడీపీలో మ‌రింత గందరగోళానికి దారితీస్తోంది.

రోడ్డెక్కిన ర‌చ్చ‌..

ఇప్ప‌టి వ‌ర‌కూ అంత‌ర్గ‌తంగా న‌డిచిన నాయ‌కుల మ‌ధ్య పోరు ఇప్పుడు రోడ్డుపై ర‌చ్చ చేసుకునే వ‌ర‌కూ సాగాయి. తాజాగా నాని విజయవాడలో డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న వర్గీయులు నానిని అడ్డుకున్నారు. ఇతర పార్టీల నేతలను టీడీపీలో ఎలా చేర్చుకుంటారంటూ నిలదీశారు. కేశినానిని వాళ్లు బూతులు తిట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన నాని.. అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో మన అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇతరపార్టీల నేతలను కలుపుకున్నారు. చంద్రబాబు చేసింది తప్పైతే నేను చేసింది కూడా తప్పే.. అయినా పార్టీలో ఎవరు తప్పుచేసినా వెళ్లి అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా నడిరోడ్డుపై అల్లరి చేస్తే ప్రయోజనం ఉండదంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. నాడు జ‌రిగిన నేత‌ల మ‌ధ్య పోరు కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య కూడా చిచ్చు పెట్టింది.

ఫ‌లితం చూప‌ని అధినేత చ‌ర్చ‌లు..

మునిసిపల్ ఎన్నికలకు ముందు విజయవాడ నేతల మధ్య విబేధాలపై టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. రెండు వర్గాలను సమన్వయం చేసే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు రంగంలో దిగారు. బుద్ధా వెంకన్న, నాగూల్ మీరాని పిలిచి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విబేధాలకు అవకాశం లేకుండా పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. అధినేత ఆదేశాలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమ‌లవుతాయా, లేదా అనేది ఇక్క‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అందుకు కార‌ణం చంద్ర‌బాబు పిలిచి మాట్లాడిన త‌ర్వాత కూడా ఆయా నేత‌లు క‌లిసి ఏ కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన్న దాఖ‌లాలు లేవు.

అంతేకాకుండా బుధ‌వారం జ‌రిగిన 11వ డివిజ‌న్ పార్టీ కార్యాల‌య ప్రారంభోత్స‌వంలో వ‌ర్గ విభేధాలు మ‌రోసారి వెలుగుచూశాయి. ఈ డివిజ‌న్ నుంచి కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న కేశినేని నాని కుమార్తె కార్యాల‌య ప్రారంభానికి బుద్దా వెంక‌న్న‌, బొండా ఉమా మ‌హేశ్వ‌రం వంటి నేత‌లు హాజ‌రుకాలేదు. ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఈ పరిస్థితి ఉండటం వారికి శ్రేయస్కరం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయింద‌ని, ఇప్పుడైనా మేల్కొన‌క‌పోతే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని సూచిస్తున్నారు.