iDreamPost
android-app
ios-app

నేరం చేస్తే శిక్ష తప్పదు బాబు!!

నేరం చేస్తే శిక్ష తప్పదు బాబు!!

రామతీర్థం సంఘటనలో ఆలయాన్ని దర్శించడానికి వెళ్లినప్పుడు రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి కాన్వాయ్ మీద దాడి చేయడం… ఆయనను ఒక వ్యూహాత్మకంగా హత్య చేయాలని ఓ పన్నాగం పండడం అనేది చాలా కీలకమైన కేసు. ఓ పార్టీకి కీలకమైన నాయకుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి మీద బహిరంగంగా దాడులకు పాల్పడి… మూక ద్వారా ఘర్షణ కోణంలో హత్యకు రచన చేశారు అన్నది పోలీసులే చెబుతున్న మాట.

నిజాలు బయటకు రావాలి!

ఇంతటి కీలక కేసులో ఏ-1గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఏ-2గా ఉన్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడుతో పాటు, కేసులో ఏ-3గా ఉన్న కళావెంకట్రావులను అరెస్ట్ చేస్తే రకరకాల పొలిటికల్ కారణాలు, రకరకాల సామాజిక వర్గ కారణాలను ఎత్తిచూపడం ప్రతిపక్షం ఆడుతున్న ఆట. నేరాల్లో ప్రమేయం ఉన్న నాయకులు అరెస్టు అయిన ప్రతిసారీ దానికి ఏదో ఒక సామాజికవర్గం రంగు లేదా రాజకీయ రంగు పులిమి తప్పించుకోవాలని భావించడం తెలుగుదేశం పార్టీకి సర్వసాధారణమైపోయింది. మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య వెనుక మాజీ మంత్రి కొల్లి రవీంద్ర ప్రమేయం, తర్వాత ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ప్రమేయం విషయంలోనూ టీడీపీ ఇలాగే నానాయాగీ చేసింది. బీసీ నాయకులను ప్రభుత్వం అనవసరంగా వేధిస్తోందని కేసులు పెడుతోందని రచ్చ చేసింది. ఆ కేసుల్లో ఆ నాయకుల నేరం బయట పడటంతో పాటు దర్యాప్తులో కీలకమైన ఆధారాలు లభించడంతో టిడిపి ఆతర్వాత మిన్నకుండి పోయింది. ఇప్పుడు తాజాగా రామతీర్థం ఘటనలో విజయసాయిరెడ్డి మీద ఓ వ్యూహాత్మకంగా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి టిడిపి అధినేత చంద్రబాబు దర్శకత్వం వహిస్తే మిగిలిన నాయకులు దానికి సహకరించారని పోలీసులు వారి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు దీనిమీద ప్రభుత్వం రాజకీయంగానే కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని కలరింగ్ టిడిపి పార్టీ ఇస్తుంది.

ఓ పద్ధతి ప్రకారమే!

వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ఘటన జరిగిన వెంటనే రామతీర్థం ఆలయాన్ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు…. అప్పటికే అక్కడికి వచ్చేసిన టిడిపి కార్యకర్తలు, ఓ వ్యూహం ప్రకారం ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించడం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రాథమికంగా దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులకు ఇది ఒక పద్ధతి ప్రకారం పైనుంచి కొందరు నాయకులు చెప్పిన దాని ప్రకారమే…. స్థానిక కార్యకర్తలు రెచ్చిపోయినట్లు గుర్తించారు. ఈ దాడిలో కాన్వాయ్ అద్దాలు పగడం తోపాటు ఇద్దరికీ కాళ్ళ గాయాలు అయ్యాయి. కార్యకర్తలు కావాలనే రాళ్ల దాడి చేసి, రాజ్యసభ సభ్యుల మీద దాడికి తర్వాత ప్రయత్నించేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనంతటికీ టిడిపి రాష్ట్ర నాయకుల ప్రమేయం ఉందని దీనికి ప్రధాన వ్యూహకర్త టిడిపి అధినేత చంద్రబాబే నని పోలీసుల వాదన. ఈ ప్రకారమే వారు ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు.

రామతీర్థం ఘటనలో పరిశీలించడానికి వచ్చిన వైసిపి నాయకుడిని ఏదైనా చేస్తే… అక్కడి ప్రజాగ్రహం ఎంతగా ఉందొ… అక్కడి స్థానికులే వైస్సార్సీపీ నాయకుడిని ఏదో చేసారని రచ్చ చేసి పబ్బం గడుపుకునేందుకు టీడీపీ నాయకులు ఆడిన డ్రామా గా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే కళావెంకట్రావు కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని సైతం టీడీపీ శ్రేణులు పెద్ద వివాదం చేశారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసు ఇవ్వడం ఏ కేసులో నైనా పరిపాటి. దీనినే టీడీపీ శ్రేణులు పెద్ద వివాదం చేసి ఏదేదో అవుతున్నట్లు పెద్దది చేసి, కేసు నుంచి తప్పించుకోవాలని భావిస్తున్నాయి.

బాబును అరెస్ట్ చేయాలి!

ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబును సైతం ఈ కేసు విషయం మీద అరెస్టు చేయాల్సి ఉంది. ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం నమోదయిన ఈ కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబు కనుక ఆయనను తప్పక చేయాల్సిన పరిస్థితి. అందులోనూ రాజ్యసభ సభ్యుడు మీద హత్య కుట్ర జరిగినట్లు పోలీసులు చెబుతుండడంతో దీనిలో బెయిల్ పొందడం కూడా అంత తేలిక కాదు. ముందస్తు బెయిల్ కు చంద్రబాబు సైతం అప్పీలు చేసిన అంత తేలికగా కోర్టు ఇచ్చేందుకు వీలు పడదు. దీంతో ఇప్పుడు టిడిపి దీనిని రాజకీయంగా పెద్ద వివాదం చేసి బయటపడేందుకు ప్లాన్ వేస్తోంది. మరి దీనిలో పోలీసులు ఎంతో చాకచక్యంగా ముందుకు వెళ్తారు? చంద్రబాబును ఎలా చట్టానికి అప్పగిస్తారు అన్నది వేచి చూడాలి.