ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు ఆపత్కాలంలో ఆ ప్రజలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. అలాంటి సేవకులనే ప్రజలు ఆదరిస్తుంటారు. మళ్లీ మళ్లీ తమ ప్రతినిధులుగా గెలిపించుకుంటుంటారు. ఇటువంటి నాయకులే నియోజకవర్గంలోనే కాకుండా బయట కూడా అందరి ప్రశంసలకు పాత్రులు అవుతుంటారు. ఆ కోవలో విజయనగరం వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నిలిచారు. లోకసభ స్పీకర్ నుంచే ప్రశంసలు అందుకున్నారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ఆయనకు లేఖ అందింది.
ప్రజలకు అండగా
నియోజకవర్గాలకు ఉత్తమ సేవలు అందించిన ఎంపీలకు లోకసభ స్పీకర్ బెస్ట్ ప్రాక్టీస్ ఎంపీగా ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి బెస్ట్ ప్రాక్టీస్ ఎంపీ ప్రశంసలను ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అందుకున్నారు. కోవిడ్ విపత్తు సమయంలో చేసిన కృషికి గాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది. 2020లో కోవిడ్ ప్రబలినప్పటి నుంచీ మూడు దశల్లోనూ తన నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉండి.. వారిలో మనోధైర్యం కల్పించారని లేఖలో కొనియాడారు. నిత్యం ఆస్పత్రులను సందర్శిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందేలా విశేష కృషి చేశారని ప్రశంసించారు. అంతేకాకుండా కోవిడ్ రెండో దశలో మెడికల్ ఆక్సిజన్ కొరత నెలకొన్న పరిస్థితుల్లో బెల్లాన తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 30 లక్షలు కేటాయించి విజయనగరం జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించిన విషయాన్ని లేఖలో ప్రస్తావిస్తూ.. దీనివల్ల జిల్లా ఆస్పత్రికి వచ్చిన కోవిడ్ బాధితులకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు.
మొదటి నుంచీ సేవా కార్యక్రమాలు
వైఎస్సార్సీపీ నాయకుడైన బెల్లాన 2019 ఎన్నికల్లో కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుపై పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. సమాజ సేవపై ఆసక్తి ఉన్న బెల్లన గ్రామాల్లో సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం వంటి అంశాల్లో గ్రామీణుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో కల్చరల్ క్లబ్బులు ఏర్పాటు చేశారు. స్పీకర్ నుంచి ప్రశంసలు అండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గెలిపించిన ప్రజలకు కష్టకాలంలో అండగా ఉండటం తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్న పార్టీ అధ్యక్షుడు జగన్ సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్పారు.
Also Read : గుప్తదాతలే కాదు గుప్త అభిమానులూ ఉన్నారు..!