iDreamPost
iDreamPost
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఆసక్తిగా మారుతున్నాయి. నెల్లూరు పరిణామాలు చర్చనీయాంశాలవుతున్నాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు, దానికి కౌంటర్ గా మంత్రి అనిల్ కుమార్ తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయి రెడ్డి స్పందన చర్చనీయాంశంగా మారుతోంది.
ఓవైపు టీడీపీ సీనియర్ నేత బీదా మస్తాన్ రావు వైఎస్సార్సీపీ కండువా కప్పుకోవడంతో బీసీలలో టీడీపీకి పెద్ద నష్టం తప్పదనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో వైస్సార్సీపీ నేతలు బహిరంగంగానే పార్టీ శ్రేణుల మధ్య అపోహలు పెంచుకునే ప్రయత్నాలు చేయడం విశేషంగా మారుతోంది. నెల్లూరు మాఫియా వ్యవహారాలంటూ ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి, విజయసాయిరెడ్డి స్పందనలు దానికి తగ్గట్టుగానే ఉన్నాయి.
Read Also: వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు
వైఎస్సార్ సీపీ విధేయత, క్రమశిక్షణ ముఖ్యమని, ఎవరు గీత దాటిన సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. సమస్యలుంటే పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలని.. మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా గీత దాటితే చర్యలు తప్పవన్నారు. తద్వారా ఆనం వ్యాఖ్యాలను తప్పుబట్టడమే కాకుండా, వార్నింగ్ కూడా ఇవ్వడం విశేషంగా కనిపిస్తోంది.
Read Also: ఆనం పేల్చిన నెల్లూరు మాఫియా బాంబు!
మొన్నటి ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన ఆనం ఆతర్వాత వెంకటగిరి స్థానం టికెట్ దక్కించుకుని, ఐదేళ్ల విరామం తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం సాధించారు. అయితే తనకు మళ్లీ అమాత్య హోదా ఖాయమని ఆయన అంచనా వేశారు. కానీ జగన్ మాత్రం దానికి భిన్నంగా యువతకు ఛాన్సివ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే అనిల్ తో పాటుగా గౌతమ్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ దక్కాయి. ఈ నేపథ్యంలలో కొంత అసంతృప్తిగా ఉన్న ఆనం తాజాగా చేసిన వ్యాఖ్యల ద్వారా తెరమీదకు వచ్చారు. ఆయనకు అధిష్టానం పెద్దలు సూటిగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎటు మళ్లుతుందన్నది ఆసక్తికరం.