iDreamPost
iDreamPost
పెళ్లి చూపులు లాంటి సాఫ్ట్ మూవీతో సోలో హీరోగా పరిచయమై అర్జున్ రెడ్డితో అమాంతం యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండకు కొంత కాలంగా ఆశించిన సక్సెస్ దక్కడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని మార్కెట్ ని మించిన బడ్జెట్ ఖర్చు పెట్టించిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ క్యూ కట్టి మరీ డిజాస్టర్లు కావడంతో తన ఫోకస్ ని మెల్లగా మాస్ సెగ్మెంట్ వైపు మళ్లిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న పూరి జగన్నాధ్ సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసేలా ఉంటుందట. ఇడియట్ తో రవితేజ, ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ల ఇమేజ్ లు ఏరకంగా అయితే కొత్త మలుపు తిరిగాయో అదే తరహాలో దీన్ని కూడా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నాడట పూరి. బ్యాలన్స్ షూటింగ్ ఇంకా మొదలుకావలసి ఉంది.
దీని తర్వాత సుకుమార్ తో చేయబోయే ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అఫీషియల్ గా చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో పుష్ప పూర్తి చేశాక సుక్కు దీని పని మీద ఉంటారు. ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దే పని జరుగుతోందట. అయితే గత రెండు మూడు రోజులుగా విజయ్ దేవరకొండ ఇప్పుడుచేస్తున్న సినిమాల తర్వాత బోయపాటి శీనుతో చేసే అవకాశాలు ఉన్నాయని మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా అతను డీల్ చేసినవాళ్లంతా అనుభవం ఉన్న సీనియర్ అండ్ ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోలు. ఊర మాస్ గా అతిశయోక్తితో కూడిన హీరోయిజం చూపించడంలో ఆయన స్టైల్ వేరు. వినయ విధేయ రామలో ఇది మరీ శృతి మించి దెబ్బ కొట్టింది.
బోయపాటి శీను ప్రస్తుతం బాలకృష్ణ హ్యాట్రిక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతా పూర్తయి విడుదలయ్యేలోగా వచ్చే వేసవి దాటుతుంది. ఇంకా షూటింగ్ రీ స్టార్ట్ కాలేదు. ఇంకొంత కాలం వేచి చూద్దామనే ధోరణిలో బాలయ్య ఉన్నారు. ఈ గ్యాప్ లోనే యూత్ హీరోకు సూటయ్యే ఓ పవర్ ఫుల్ సబ్జెక్టు బోయపాటి సిద్ధం చేసుకున్నారని వినికిడి. అది విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ సరిపోయేలా ఉండటంతో ఆ కోణంలో ప్రతిపాదన జరిగిందని సమాచారం. ఇదే కనక నిజమైతే రౌడీ హీరో ఇకపై మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. మార్కెట్ బలపడి పాన్ ఇండియా లెవెల్ కు వెళ్లాలంటే మాస్ ని టార్గెట్ చేయక తప్పదు. విజయ్ దేవరకొండ ప్లాన్ అలాగే కనిపిస్తోంది. బోయపాటి కాంబోలో నిజమెంతో ఇంకా తెలియాల్సి ఉంది.