iDreamPost
iDreamPost
కార్యనిర్వాహక రాజధానిగా ఖరారయిన విశాఖలో ఇటీవల వరుస ప్రమాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనూహ్య పరిణామాలతో అనార్థాలు జరగడం చాలామందిని కలవరపరుస్తోంది. భారీ ప్రమాదాలతో పాటుగా ఇతర ఘటనలకు ఇటీవల ప్రచారం పెరిగింది.
ముఖ్యంగా రాజధాని వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న తరుణంలో విశాఖలో జరిగే చిన్నపాటి విషయాలు కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాల్లో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన కనిపిస్తోంది. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ నుంచి తాజా షిప్ యార్డ్ ప్రమాదం వరకూ బాధితులకు భరోసా కల్పించంలో సర్కారు సక్సెస్ అయ్యింది. అయిన వాళ్లను కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచేలా భారీగా నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవడం అందరినీ ఆకర్షించింది. అదే సమయంలో ప్రమాదాల నివారణపై మరింతగా అధికారులను కదిలించే ప్రయత్నం జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే తాజాగా జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
విశాఖ నగరం చుట్టూ వివాదాలు రాజేసే ప్రయత్నంలో ఉన్న ఓ సెక్షన్ ఇప్పుడు చిన్న చిన్న అంశాలను కూడా భూతద్దంలో చూపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. దానికి గడిచిన కొన్ని నెలలుగా సాగుతున్న పరిణామాలే కీలకం. యంత్రాంగం వైఫల్యం కూడా వాటికి అవకాశం కల్పిస్తోంది. కీలకమైన నిఘా బృందాల చొరవ మరింత అవసరంగా కనిపిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతకు సంబంధించిన విషయాల్లో ఆయా శాఖలు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో కీలకమైన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ సీఈవోని కూడా ఇటీవల అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే సంకేతాలు పంపించారు. అందుకు అనుగుణంగా పరిశ్రమలు, కాలుష్‌య నివారణ శాఖల అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలని సీఎం కూడా ఆదేశించారు. ప్రస్తుతం స్పెషల్‌డ్రైవ్ ముమ్మరంగా సాగుతోందని , వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీయల్ పాలసీ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్న తరుణంలో అధికారుల పాత్ర మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పరిశ్రమల్లో సేఫ్టీ పాలసీని పటిష్టం చేస్తూ భద్రత కోసం ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ కూడా ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, వాటి క్యాటగిరీల వివరాలన్నింటితో ఓ అట్లాస్ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. థర్డ్‌పార్టీ తనిఖీల వివరాలను కూడా అందరికీ తెలిసేలా డ్యాష్ బోర్డులలో ఉంచాలని సీఎం సూచించారు. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలని తెలిపారు. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలని, నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇన్ హెబిటర్స్ ఉంటే నష్టం చాలా వరకూ తగ్గేదని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే సమస్య తీవ్ర మయ్యిందని పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలని, పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా విధానంలో పొందుపరచాలని అధికారులకు తెలిపారు.
ముఖ్యమంత్రి అంచనాలకు అనుగుణంగా సిబ్బందిలో కదలిక తీసుకురావడానికి వేగంగా చర్యలుండాలి. ఇప్పటికే విశాఖ నగరంలోని వివిధ రసాయన, ఇతర పరిశ్రమలకు సంబంధించిన అంశాలలో మరింత పటిష్టమైన భద్రత కోసం తనిఖీలు చేపట్టాలి. లాక్ డౌన్ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలలో సేఫ్టీ కి సంబంధించిన అంశాలలో చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచాలి. విశాఖ చుట్టూ ఉన్న భారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అత్యవసరంగా కనిపిస్తోంది.