Idream media
Idream media
ఇపుడైతే ఫోన్లలోనే సినిమాలు చూసేస్తున్నాం కానీ, 40 ఏళ్ల క్రితం వీడియో కేఫ్‌లు ఉండేవంటే ఇప్పటి పిల్లలు ఆశ్చర్యపోతారు. బస్సులో సినిమా వేస్తారని తెలిసినప్పుడు నేను నమ్మలేదు. సినిమా అంటే ఒక ప్రొజెక్టర్, స్క్రీన్ వుండాలి కదా, అవన్నీ బస్సుల్లో ఎలా సాధ్యం. వీడియో క్యాసెట్లు ఉంటాయని తెలియని కాలం. ఒకసారి బెంగళూరు వెళితే (1981) అనంతపురానికి వీడియో కోచ్ ఎక్కాను, టికెట్ ఎక్కువైనా. టీవీ బాగా కనపడే సీట్లో కూచున్నా. బెంగళూరులో బయలుదేరినప్పటి నుంచి ఎదురు చూశా. పెనుగొండ దాటిన తర్వాత ఓ అరగంట పాటలు వేశాడు. అవి కూడా సరిగా కనపడలేదు.
మొదటిసారిగా అనంతపురం గుల్జార్‌పేటలో వీడియో కేఫ్ వెలసింది. టికెట్ నాలుగు రూపాయలు. అప్పట్లో శాంతి టాకీస్ బాల్కనీ రూ.2.70. గాంధీ సినిమా వేశారు. మధ్యలో ఇంటర్వెల్. స్వీట్, బూందీ, టీ ఇచ్చారు. కేఫ్ కదా! క్యాసెట్ క్వాలిటీ లేదు, ఏదో వీడియో సినిమా చూశామనే మోజు తీరింది. తర్వాత శ్రీకంఠం థియేటర్ ఎదురుగా ఒక కేఫ్. అంధాకానూన్ సినిమా. దీని ప్రత్యేకత ఏమంటే టీవీకి ఏదో గ్లాస్ అమర్చారు. బొమ్మ పెద్దది కనపడింది. జనం బాగానే వచ్చారు. రోజుకి నాలుగు ఆటలు. షోకి 200 వచ్చినా 800 కలెక్షన్. ఇచ్చే స్వీట్ హాట్‌కి టీకి కలిపి రూ.200 ఖర్చు అయినా రూ.600 రోజుకి మిగులు.
సాయినగర్ లాంటి సెంటర్లో సెంట్ భూమి రూ.10 వేలు చేయని కాలం. ఊళ్లో వాళ్లందరికీ ఆశ పుట్టింది. సుభాష్‌రోడ్డు, శ్రీకంఠం సర్కిల్‌లో రోజుకొకటి పుట్టాయి. కొత్త ఇంగ్లీష్ సినిమాలు హైదరాబాద్‌లో రిలీజైన ఆరు నెలలకి ఎంటర్ ది డ్రాగన్ లాంటి సినిమా వచ్చే వెర్రి కాలం. వరుసబెట్టి చూశాను. రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, జేమ్స్‌బాండ్ సిరీస్ అన్నీ చూసేశాను. పోటీ పెరిగే సరికి సైడ్ సౌండ్ బాక్స్‌లు కూడా వచ్చాయి. టికెట్ ధర మూడు రూపాయలు చేశారు. జనం విరగబడి చూశారు. రెండు నెలలకి మొహంమొత్తింది.
బిజినెస్ కోసం సెమీ న్యూడ్ సినిమాలు మొదలయ్యాయి. కలిగులా ఒకేరోజు నాలుగు కేఫ్‌ల్లో వేశారు. ఇవి కూడా ఆడలేదు. పూర్తిగా బ్లూ ఫిల్మ్స్‌లోకి దిగారు. పోలీసులు కొంత కాలం భరించి, వరుసగా మూయించారు. వరదలా వచ్చి కేఫ్‌లు మాయమయ్యాయి. గిల్డ్ ఆప్ సర్వీస్ స్కూల్ ఎదురుగా ఒక కేఫ్ చాలా రోజులు నడిచింది. క్లాసిక్స్ వేసేవాడు. రెండు రూపాయలు టికెట్. ఒక రూమ్‌లో 50 నుంచి 100 మంది కూచొని చూసే కాలం పోయి, నలుగురైదుగురు మాత్రమే ఉండే కాలం వచ్చింది. తర్వాత అది కూడా మూతపడింది.
అయితే వీడియోలు పల్లెల్లో ప్రవేశించాయి. కొత్త సినిమాల్పి రూపాయికి చూపించే వాళ్లు. దీని కారణంగా చిన్న వూళ్లలోని టెంట్లు మూతపడ్డాయి. కొత్తలో ప్రతిదీ విచిత్రమే. మనం ఒకప్పుడు ఫోన్లలో , లాప్‌టాప్‌లలో సినిమాలు చూసే వాళ్లమంటే వచ్చే జనరేషన్స్ నవ్వే రోజు కూడా వస్తుంది.