iDreamPost
android-app
ios-app

ఈఫిల్ టవర్ ని తుక్కు కింద అమ్మిన వంచనా కళాకారుడు

ఈఫిల్ టవర్ ని తుక్కు కింద అమ్మిన వంచనా కళాకారుడు

అధికారంలో ఉండి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మడాన్ని, తుక్కు కింద కొన్న బస్సులను నకిలీ పత్రాలతో కొత్త వాటికింద అమ్మడాన్ని మనం కుట్ర, మోసం, దగా, స్కామూ అంటున్నాం కానీ పాశ్చాత్యులు దీన్ని కళ కింద జమకట్టి, ఇలాంటి పనులు చేసిన వారికి con artists అని మంచి బిరుదు కూడా ఇచ్చారు. తెలుగులో దీనిని స్వేచ్ఛానువాదం చేస్తే వంచనా కళాకారులు అవుతుంది.

పారిస్ నగరంలో 1889లో నిర్మించబడిన ఈఫిల్ టవర్ ఎంతో మందిని ఆకర్షించి, పారిస్ నగరానికే తలమానికంగా ఉన్నా, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పారిస్ నగరానికి మోయలేని భారంగా తయారయింది. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ వల్ల టవర్ నిర్వహణ కష్టమైంది. తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు రంగులు వేయడం, క్రమం తప్పకుండా రిపేర్లు చేయడం పారిస్ నగరపాలక సంస్థకు తలకు మించిన భారంగా మారింది.

అప్పుడు ఫ్రెంచ్ రాజకీయ నాయకులు కొంతమంది టవర్ కూలదోసి, తుక్కు కింద అమ్మేయడం మంచిది అని అన్నారు. ఈ విషయాన్ని వార్తాపత్రికలలో చూసిన ఆస్ట్రియా దేశస్థుడు విక్టర్ లస్టిగ్ దీనిలో గొప్ప అవకాశాన్ని చూశాడు. ఒక ప్రణాళిక రూపొందించి, అందుకు అవసరమైన పత్రాలను తనకు తెలిసిన ఒక ఫోర్జరీ చేయడంలో నిపుణుడైన వ్యక్తి చేత రూపొందించుకుని, అవసరమైన నకిలీ సీళ్ళు కూడా తయారు చేసుకుని పారిస్ నగరంలో ఒక ఖరీదైన హోటల్లో వాలిపోయాడు.

స్కాము – స్కీము

నగరంలో స్క్రాప్ మెటల్ డీలర్లు కొందరిని గుర్తించి, వారికి ఫ్రైంచ్ ప్రభుత్వం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ మంత్రిత్వ శాఖ నుంచి, తనను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా తెలుపుకుంటూ లేఖలు పంపాడు. ఈఫిల్ టవర్ నిర్వహణ పారిస్ నగరానికి భారమైనందువల్ల తుక్కు కింద అమ్మేయాలని నిర్ణయించారని, అందుకు గానూ నగరంలో సమర్ధులైన స్క్రాప్ డీలర్లని గుర్తించి, చర్చించడానికి హోటల్లో కలవవలసిందిగా ఆహ్వానం పంపిస్తున్నామనీ, ఈ విషయం బయటపడితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందువల్ల అన్ని విషయాలు ఫైనలైజ్ అయ్యే వరకూ రహస్యంగా ఉంచవలసి వచ్చిందనీ రాసి, తన హోటల్ అడ్రస్ ఇచ్చాడు విక్టర్ లస్టిగ్

ప్రభుత్వ అధికారిక లెటర్ హెడ్ మీద, అధికారిక సీలు వేసి ఉన్న లెటర్ చూసిన ఎవరికీ అనుమానం రాలేదు. చెప్పిన సమయానికి హోటల్లో సమావేశమయ్యారు. “మీ సమర్ధత, నిబద్ధత, నిజాయితీ చూసి మిమ్మల్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. మీరు బిడ్లు రెడీ చేసుకోండి. రెండు వారాల తర్వాత మళ్లీ సమావేశం ఉంటుంది. అప్పుడు హయ్యెస్ట్ బిడ్డర్ ఈ డీల్ దక్కించుకుంటారు” అని ఎవరికీ అనుమానం రాకుండా సమావేశం నడిపించాడు లస్టిగ్.

సమావేశం అసలు లక్ష్యం తన గేలానికి తేలిగ్గా చిక్కే చేపను గుర్తించడం. ఆండ్రై పోయిసోన్ రూపంలో అతనికి కావలసిన చేప దొరికింది. అతనితో మరోసారి సమావేశమయ్యారు లస్టిగ్. ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోవడం లేదని, ఈ డీల్ పోయిసోన్ కి దక్కేలా చేసి కమీషన్ దండుకోవడం తన ఉద్దేశం అని అతనిని నమ్మించాడు. తన కమీషన్ తనకిస్తే మిగిలిన వారితే సంబంధం లేకుండా డీల్ నీకే అని నమ్మించాడు.

అంతా పక్కాగా అధికారిక పత్రాల మీద ఉండడంతో ఏమాత్రం అనుమానం రాకుండా యాభైవేల ఫ్రాంకుల లంచం, డెభ్బైవేల ఫ్రాంకుల అడ్వాన్స్ సమర్పించుకుని, అధికారిక పత్రం మీద, అధికారిక సీలుతో ఈఫిల్ టవర్ ను తను కొన్నట్టు, అందుకు డెభ్బైవేల ఫ్రాంకుల అడ్వాన్స్ చెల్లించినట్టు, టవర్ కూల్చివేతకు ముందు మరో ఎనభైవేల ఫ్రాంకులు చెల్లించాలని సేల్ డీడ్ స్వంతం చేసుకున్నాడు ఆండ్రె పోయిసోన్.

డబ్బు చేతికందిన మరుక్షణం బిచాణా ఎత్ఢేశాడు లస్టిగ్. మోసపోయిన వాళ్లు ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగల్లా ఉంటారన్న లస్టిగ్ అంచనా నిజమైంది. హోటల్లో సమావేశమైన డీలర్లు కానీ, పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న పోయిసోన్ కానీ చప్పుడు చేయకుండా ఉండిపోయారు.

రెండేసారీ అదే ప్లాన్

కొన్నాళ్ళు క్రమం తప్పకుండా పారిస్ వార్తాపత్రికలు చదువుతూ ఉన్న విక్టర్ లస్టిగ్ ఎక్కడా తన స్కామ్ గురించిన వార్తలు రాకపోవడంతో ధైర్యం తెచ్చుకుని మరో బ్యాచ్ స్క్రాప్ డీలర్లతో అదే ప్లాన్ రిపీట్ చేసే ప్రయత్నం చేశాడు. అంతా బాగా జరిగినా చివరిలో ఎందుకో అనుమానం వచ్చి ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు రాకముందే లస్టిగ్ పారిపోయి అమెరికా చేరుకున్నాడు. అమెరికాలో కొంతకాలం దొంగనోట్ల చెలామణి చేసి, పోలీసులకు చిక్కి, నేరం రుజువు కావడంతో జైలు శిక్ష అనుభవిస్తూ, న్యుమోనియాతో మరణించాడు విక్టర్ లస్టిగ్.