iDreamPost
android-app
ios-app

తీవ్ర ఆవేద‌న చెందుతున్నానంటున్న వెంక‌య్య

తీవ్ర ఆవేద‌న చెందుతున్నానంటున్న వెంక‌య్య

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. ఆయ‌న‌ అంత‌లా ఆవేద‌న చెంద‌డానికి కార‌ణాలేంటి..? ఆయ‌న‌ను క‌లిచివేసిన ఘ‌ట‌న‌లు ఏంటి..? త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ అలాంటి ఘ‌ట‌న‌లు చూడ‌లేద‌న‌డానికి కార‌ణాలేంటి..? పార్ల‌మెంట్ లో వ‌్య‌వ‌సాయ బిల్లులు ఆమోదం పొంద‌డంపై చ‌ర్చ ఓ వైపు.. స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై చ‌ర్చ మ‌రోవైపు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఎన్టీయే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పార్ల‌మెంట్ స‌మావేశాలు ఇంత హాట్ గా జ‌రిగిన సంద‌ర్భాలు లేవు. ఎన్టీయే రెండో సారి పూర్తి స్థాయిలో అధికారంలోకి రావ‌డంతో ఇక తిరుగులేద‌న్న‌‌ట్లుగానే క‌నిపించింది. వ్య‌వ‌సాయ బిల్లులు ఆమోదం పొందిన‌ప్ప‌టికీ స‌భ‌లో జ‌రిగిన రాద్దాంతంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌న‌మే నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఎలా…

పార్ల‌మెంట్ ఎగువ‌స‌భ‌లో ఆదివారం నాటి ప‌రిస్థితులు రాజ్యసభ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, రాజ్యసభ చరిత్రలో అదో దుర్దినం అని వెంక‌య్య‌నాయుడు అభిప్రాయప‌డుతున్నారు. ‘ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. అది దురదృష్టకరం, అనంగీకారం, ఖండించదగినది’ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం పేర్కొన్నారు. కొందరు సభ్యులు.. కరోనా నేపథ్యంలో సురక్షిత దూరం పాటించాలన్న నిబంధలను ఉల్లంఘించించారని కూడా చైర్మన్ పేర్కొన్నారు. ‘మనమే కరోనా నిబంధనలను పాటించకపోతే.. సామాన్య ప్రజలు పాటించాలని ఎలా అనుకుంటాం?’ అని వెంక‌య్య ప్రశ్నించారు. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి పేపర్లు, రూల్ బుక్‌ను డిప్యూటీ చైర్మన్‌పై విసిరేసి ఆయన్ను దూషించిన విషయాన్ని చైర్మన్ గుర్తుచేశారు. మరికొందరు సెక్రటరీ జనరల్ బల్లపైకి ఎక్కి నినాదాలు చేస్తూ, గంతులు వేశారని, పేపర్లు చించేశారని, మైకులు విరగ్గొట్టి డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారన్నారు. ‘ఇదేనా పార్లమెంటరీ స్థాయి. దీనిపై సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని చైర్మన్ పేర్కొన్నారు.

బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేసే అవ‌కాశం ద‌క్కేది..

సభ సజావుగా సాగితే.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసే అవకాశం విపక్ష సభ్యులకు ఉండేదని వెంక‌య్య అంటున్నారు. డిప్యూటీ చైర్మన్‌ను భౌతికంగా భయపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఒకవేళ సమయానికి మార్షల్స్ ను పిలిచి ఉండకపోతే డిప్యూటీ చైర్మన్‌కి ఏమై ఉండేది… ఇది చాలా బాధాకరం’ అన్నారు. ఒకవేళ సభ్యుల వద్ద సరైన సంఖ్యాబలం ఉన్నట్లయితే వారు చర్చించి ఉండాల్సిందని.. అలా కాకుండా.. సీట్లలోనే ఉంటే ఓటింగ్‌ నిర్వహిస్తామని డిప్యూటీ చైర్మన్ చెబుతున్నా ఇలా దూకుడుగా వ్యవహరించడం సరికాదన్నారు. కొందరు సభ్యులు తాము చేసిన పనిని ప్రసారమాధ్యమాలు వేదికగా అంగీకరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చైర్మన్ గుర్తుచేశారు. మరోవైపు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ.. వారిని తొలగించాలంటూ.. ప్రతిపక్ష నేత, 46 మంది రాజ్యసభ సభ్యుల నుంచి తనకు లేఖ అందిందని చైర్మన్ వెంకయ్యనాయుడు వెల్లడించారు. డిప్యూటీ చైర్మన్‌పై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆదివారం నాటి సభాకార్యక్రమాలను తాను క్షుణ్ణంగా పరిశీలించానని ఆయన అన్నారు. ‘సభలో గందరగోళం కొనసాగటం కారణంగానే బిల్లుపై చర్చ సాధ్యం కాలేదని అన్నారు.