Idream media
Idream media
ఏపీలో రాజకీయ వేడి విచిత్రంగా అమరావతి నుంచి విశాఖకు మారింది. .అయితే విషయం రాజధాని కాదు.. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే తాపత్రయంగా అది కనిపిస్తోంది. కొద్ది రోజులుగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీరు స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాల జోరు కొనసాగుతూ పేదల కలలు సాకారం అవుతూ ఉంటే.. ఈ నియోజకవర్గంలో మాత్రం సవాళ్లు – ప్రతి సవాళ్లతో రాజకీయ ప్రయోజనాల కోసం మినహా స్థానిక ఎమ్మెల్యే తమకోసం పట్టించుకోవడం లేదని పలువురు విమర్శలు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సవాళ్ల రాజకీయంతో ఆదివారం కూడా ఆ ప్రాంతమంతా రాజకీయ వైషమ్యాలు నిండిపోయాయి. ఈస్ట్ పాయింట్‌లోని సాయిబాబా ఆలయం వేదికగా రాజకీయ రచ్చ కొనసాగుతోంది. తన కబ్జాల బాగోతాన్ని అధికారులు బట్టబయలు చేసి చర్యలు చేపట్టిన నాటి నుంచి ఆయనలో మార్పు కనిపిస్తోంది. ఆరోపణల నుంచి బయటపడాలని తెగతాపత్రయ పడుతున్నారు. వైసీపీ నేతలపై ప్రత్యారోపణలు, ప్రమాణాల ద్వారా తాను సచ్ఛీలుడుగా నిరూపించుకోవడంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టేశారు.
కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రమాణాలకు ఆజ్యం పోసిన వెలగపూడి.. నేటి వరకు కూడా ఆ ఆజ్యం రగులుతూనే ఉంది. ప్రమాణాలపై పొలిటికల్ హైడ్రామా జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఏ క్షణం ఎలా మారుతుందోనన్న ఆందోళన స్థానిక ప్రజల్లో నెలకొంది. వెలగపూడి బినామీ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిననాటి నుంచీ రాజకీయ వైషమ్యాలు పెంచడం ద్వారా వాటి నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రమాణాల లక్ష్యం పక్కదారి పడుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూర్పు నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈస్ట్ పాయింట్‌లోని బాబా ఆలయ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో తమకు ప్రయోజనం లేదని తూర్పు నియోజకవర్గంలోని కొందరు వాపోతున్నారు. రాజకీయంగా వైషమ్యాలు ఎలాగున్నా.. సామాజికంగా ప్రజా కార్యక్రమాలపై నిర్లిప్తత తప్పదని, అది వెలగపూడి రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.