బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను ఆ కేసు నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తప్పించింది. ఇప్పుడు కొత్త బృందం ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసును విచారించనుంది . సమీర్ వాంఖడేపై రికవరీ ఆరోపణలు రావడంతో ఇది జరిగిందని చెబుతున్నా అదేమీ లేదని సమీర్ వాంఖడే చెబుతున్నారు. అక్టోబరు 2న సమీర్ వాంఖడే ఎన్‌సీబీ బృందంతో కలిసి ముంబైలో క్రూయిజ్‌పై దాడి చేయగా ఆ సమయంలో, ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాతో సహా చాలా మంది సమీర్ వాంఖడే చేతికి చిక్కారు. అనంతరం అందరినీ అరెస్టు చేశారు. అయితే తరువాత పలువురు బెయిల్‌పై బయటకు వచ్చారు.
డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గరి నుంచి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వాంఖడే కోట్లకు పడగలెత్తారు, ఒక నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యం కాని రీతిలో ఖరీదైన వస్తువులు వాడుతున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా వాంఖడే మతం పైన కూడా చర్చ జరగగా వాంఖడే భార్య తెరమీదకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఆర్యన్‌ఖాన్ కేసులో ఎన్‌సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాలన్నారని కేసులో సాక్షులుగా ఉన్నవారు చెప్పడంతో వాంఖడే టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలో డిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయం కల్పించుకుని ఈ కేసులో సమీర్ వాంఖడేతో పాటు మరికొందరిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అది పూర్తి కాకుండానే ఇప్పుడు కేసు నుంచి వాంఖడేను తప్పించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
క్రూయిజ్ డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖడేను తొలగించిన నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీబీ బృందం శనివారం ముంబైకి చేరుకుంటుంది. ఈ బృందం ముంబై జోన్‌లోని 6 కేసులను అంటే ఆర్యన్ ఖాన్ కేసు మరియు 5 ఇతర కేసులను విచారించనుందని అంటున్నారు. ఎన్సీబీ సౌత్ వెస్ట్రన్ డిప్యూటీ డీజీ ముతా అశోక్ జైన్ చెబుతున్న దాని ప్రకారం ఈ సౌత్ వెస్ట్రన్ జోన్‌లోని మొత్తం 6 కేసులను ఇప్పుడు ఢిల్లీలోని ఎన్సీబీ బృందాలు దర్యాప్తు చేస్తాయట, ఆ కేసుల్లో ఆర్యన్ ఖాన్ కేసు సహా మరో 5 ఇతర కేసులు ఉన్నాయి. ఇది పరిపాలనా పరమైన నిర్ణయం అని ఆయన చెబుతున్నారు. ఇక సమీర్ వాంఖడే కూడా మాట్లాడుతూ, ‘నన్ను విచారణ నుండి తప్పించలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాల్సిందిగా తానే కోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు చెబుతున్నారు. ఇది ఢిల్లీ, ముంబై ఎన్సీబీ టీమ్స్ మధ్య సాయం చేసుకోవడం లాంటిదని ఆయన చెబుతున్నారు. కేసు విచారణ నుంచి తప్పించినప్పటికీ ఎన్‌సీబీ ముంబయి జోన్ డైరెక్టర్‌గా వాంఖడేనే కొనసాగనున్నారు.