Idream media
Idream media
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం మరింత ఆసక్తిగా మారుతోంది. టీడీపీ క్యాంపులో కాక రేపుతోంది. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన వంశీ ఆపార్టీని పైకి లేపడం ధర్మాడి సత్యం వల్ల కూడా కాదంటూ సెటైర్లు విసురుతూనే, నారా లోకేశ్ టీడీపీకి బరువు అన్నట్టుగా విరుచుకుపడ్డారు. ఇక తాజాగా ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఆ క్రమంలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీద గురిపెట్టినట్టు స్పష్టం అవుతోంది. లోకేశ్ ఆధ్వర్యంలో సాగుతున్న టీడీపీ సోషల్ మీడియా బృందం తనను బద్నాం చేసే ప్రయత్నంలో ఉందని ఆరోపించిన వంశీ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం ముదురుతున్నట్టు కనిపిస్తోంది. తన మీద తప్పుడు రాతలు రాయించి, కించపరిచే ప్రయత్నం టీడీపీ సోషల్ మీడియా చేస్తోందని విమర్శలుచేసిన వంశీ విజయవాడ సీపీని కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మీడియా ముందు వల్లభనేని వంశీ చేస్తున్న వ్యాఖ్యలు ఒక భాగం అయితే సోషల్ మీడియాలో టీడీపీ సొంత వెబ్ సైట్ల నుంచి నడుస్తున్న వ్యవహారంపై వంశీ దూకుడు మరో కీలకాంశంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పలు వెబ్ సైట్లు నడుపుతున్నారని వంశీ ఇప్పటికే ఆరోపించారు. అందులో కొన్నింటి పేర్లు కూడా ప్రస్తావించారు. ఆయా సైట్లలో తమకు గిట్టని వారి పట్ల అభ్యంతకర అంశాలు పోస్ట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. అంతటితో సరిపెట్టుకుండా ఇప్పుడు నేరుగా పోలీసులకు రాతపూర్వకంగా పిర్యాదు చేయడం విషయం మరింత ముదురుతుందనడానికి సంకేతాగా కనిపిస్తోంది.
వల్లభనేని వంశీ తన ఫిర్యాదులో అనేక విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా తాను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తూ గౌరవంగా బతుకుతుంటే కొందరు తనను కించపరిచేలా, పరువు తీసేలా పోస్టులు చేస్తున్నారంటూ పలు ఆధారాలు సమర్పించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పై చర్యలు తీసుకోవాలని కోరిన వంశీ, అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్ల నుండి ఈ దుష్ప్రచారం జరుగుతోందని ప్రాథమిక సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు ఆయన అందజేశారు. దాంతో ఇప్పుడు టీడీపీ క్యాంప్ నుంచి నడుస్తున్న సైట్లపై పోలీసులు చర్యలకు రంగంలో దిగితే సీన్ మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ గా ఉన్న నారా లోకేశ్ ని ఈ వ్యవహారంలోకి లాగే అవకాశం కూడా ఉంటుంది. అదే జరిగితే రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశం ఉంటుంది. తనపై ఆరోపణలు విమర్శలు చేస్తున్న టిడిపి నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసని, వారి బండారం మొత్తం బయటపెడతానని వంశీ చెబుతున్న తరుణంలో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంవంశీ టుందో చూడాలి. పోలీసులు ఏమేరకు స్పందిస్తారన్న దానిని బట్టి పరిణామాలు ఉంటాయనే అంచనాలు వినిపిస్తున్నాయి.