iDreamPost
iDreamPost
పలుకుబడి కోసమే రాజకీయాల్లోకి రావడం.. సంపాదనకు ఆ పదవులను వాడుకోవడం ఈ రోజుల్లో కామన్. కొన్నేళ్లు వెనక్కి వెళితే విలువలు పాటిస్తూ.. సైద్ధాంతిక రాజకీయాలు చేసిన పలువురు నాయకులు మన కళ్ల ముందు మెదులుతారు. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన హనుమంతు అప్పయ్య దొర ఒకరు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయికి ప్రజాబలంతోనే ఎదిగారు. ఏనాడూ డబ్బు, పదవులు ఆశించలేదు. అన్నీ ఆయన్ను కోరి వరించాయనడం అతిశయోక్తి కాదు. పేదల లాయర్ గా ప్రసిద్ధుడైన ఆయన.. వంశధార ఎడమ కాలువ, ఆఫ్ షోర్ రిజర్వాయర్ కోసం జీవితాంతం కృషి చేశారు.
పేదల లాయర్
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన అప్పయ్యదొర విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. సోంపేట, టెక్కలి కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్రంలోనే ప్రముఖ క్రిమినల్ లాయర్లలో ఒకరిగా పేరుపొందారు. అయితే ఎక్కువగా పేద ప్రజల కేసులే వాదించేవారు. ముఖ్యంగా పలాస, వజ్రపుకొత్తూరు, మందస, తదితర తీరప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారులకు న్యాయపరంగా బాసటగా నిలిచేవారు. పైసా తీసుకోకుండా కేసులు వాదించడంతో పాటు.. వారికి ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు ముందుండేవారు. అందుకే తీరప్రాంతాల్లో ఆయన్ను దేవుడిలా చూసేవారు. ఆయన మాటను ఎవరూ జవదాటేవారు కాదు. ఆ పేరు ప్రతిష్టలే.. ఆయన్ను రాజకీయాల్లో రాణించేలా చేశాయి.
రెండు దశాబ్దాలు ఏకగ్రీవ సర్పంచ్
స్వగ్రామమైన బెండి పంచాయతీ సర్పంచిగా 1961లో ఏకగ్రీవంగా ఎన్నికైన దొర.. 1981 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1981లో బెండి సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ పిలుపునందుకొని తెలుగుదేశంలో చేరిన ఆయన 1984 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఎంపీ అయ్యారు. లోక్ సభలో తన వాగ్ధాటితో అనేక అంశాలపై ప్రసంగాలు చేసి ఉత్తమ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు అందుకున్నారు. 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు టెక్కలి, హిందూపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. అయితే హిందూపురంలో కొనసాగి.. టెక్కలి సీటుకు రాజీనామా చేయడంతో 1995లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో అప్పయ్యదొర టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెసులో చేరిన ఆయన 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2004లో అదే టెక్కలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరినా.. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. అయితే కొన్నాళ్లకే అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ 2014 సెప్టెంబర్ 5న కన్నుమూశారు.
వంశధార విస్తరణ, ఆఫ్ షోర్ ఆయన కృషి ఫలితమే
ప్రజా ప్రతినిధిగా శ్రీకాకుళం జిల్లా సమస్యలపై పార్లమెంటులో తరచుగా గళం విప్పి ప్రస్తావించిన అప్పయ్యదొర ఎన్నో సమస్యలకు పరిష్కారం సాధించారు. ఇటీవలే వంశధార ట్రిబ్యునల్ అనుమతి పొందిన నేరడి బ్యారేజ్ వంశధార రెండోదశ ప్రాజెక్టులో అంతర్భాగమే. రెండు దశలుగా చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తి చేసుకొని 1978లోనే అందుబాటులోకి వచ్చినా.. ఒడిశా అభ్యంతరాలతో రెండోదశకు గ్రహణం పట్టింది. ఈ అంశాన్ని ఎంపీ అయిన తర్వాత అప్పయ్యదొర లోక్ సభలో ప్రస్తావించి పెద్ద చర్చ జరిగేలా చేశారు. దీనికి స్పందించిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వంశధార ప్రాజెక్టు పూర్తి వివరాలు రాత పూర్వకంగా ఇవ్వాలని దొరకు సూచించారు. ఆ మేరకు ఎంపీ రాసిన లేఖకు స్వయంగా రాజీవే రిప్లై కూడా ఇచ్చారు. వంశధార ఎడమ కాలువ సమస్యపై మీరు రాసిన లేఖను పరిష్కారం కోసం జలవనరుల విభాగానికి పంపినట్లు పేర్కొంటూ స్వయంగా సంతకం చేసి మరీ లేఖ పంపారు. అదే విధంగా నందిగం, టెక్కలి, పలాస, మెలియాపుట్టి మండలాలకు సాగునీరు, పలాస పట్టణానికి తాగునీరు అందించేలా ఆఫ్ షోర్ రిజర్వాయర్ మంజూరుకు అప్పయ్యదొర విశేష కృషి చేశారు. నేడు ఆయన లేకపోయినా అవాంతరాలను అధిగమించి వంశధార రెండోదశ, ఆఫ్ షోర్ ప్రాజెక్టులు రూపం దాల్చుతూ నిరంతరం అప్పయ్యదొరను గుర్తు చేస్తున్నాయి.
Also Read : అయ్యో డేవిడ్‌రాజు..!