iDreamPost
iDreamPost
ఇప్పటికింకా సంక్రాంతికి పక్కాగా ఏ సినిమాలు వస్తాయో ఇంకా లెక్క తేలనే లేదు కానీ అప్పుడే 2021 సమ్మర్ గురించిన చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు షూటింగ్ కీలక స్టేజిలో ఉన్నవి వేసవిని టార్గెట్ చేసుకుని ప్లాన్ రెడీ చేసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా అప్పటికంతా పూర్తిగా వెళ్ళిపోయి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసి ఉంటుంది కాబట్టి వంద శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు సిద్ధంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూట్ ఎప్పుడు పూర్తయినా విడుదల మాత్రం ఏప్రిల్ లేదా మేలో ఉండేలా నిర్మాత దిల్ రాజు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు హింట్ ఇచ్చారని ఫిలిం నగర్ టాక్. బయటికి కన్ఫర్మ్ చేయలేదు.
మరోవైపు చిరంజీవి ఆచార్య జనవరి నుంచి షూటింగ్ వేగం పెంచబోతోంది. రామ్ చరణ్ తో పాటు కాజల్ అగర్వాల్ కూడా అదే షెడ్యూల్ లో అడుగు పెడుతుంది. అయితే ముందు ప్రకటించిన ప్రకారం ఈ సినిమా సమ్మర్ కు రాకపోవచ్చని లేటెస్ట్ అప్డేట్. ఎంత వేగంగా తీసినా చిరు ఆరోగ్య దృష్ట్యా ఎక్కువ రిస్క్ చేయకుండా నాలుగైదు నెలల్లో మొత్తం పూర్తి చేసేలా కొరటాల శివ ప్లాన్ చేశారట. ఇదే నిజమైతే సమ్మర్ టార్గెట్ చేరుకోవడం జరగని పని. ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకుంటే సైరా తరహాలో దసరాకు రిలీజ్ చేసుకోవచ్చు. యావరేజ్ టాక్ తోనే సైరా వంద కోట్లు ఈజీగా రాబట్టింది.
ఈ లెక్కన చూస్తే రానున్న రోజుల్లో చాలా సినిమాలు తాము కట్టుబడిన తేదీల మీద నిలబడటం కష్టమే అనిపిస్తుంది. ఇప్పటికీ కెజిఎఫ్ 2 సంగతి తేలలేదు. నారప్ప మనసులో ఏముందో తెలియదు. రాధే శ్యామ్ పరిస్థితి అంతుచిక్కడం లేదు. దేశమంతా థియేటర్లు తెరిచినా తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ససేమిరా అంటున్నారు. 2020 ఎప్పుడు అయిపోతుందాని ముళ్ళమీద కూర్చున్నట్టు ఎదురుచూస్తోంది సినిమా పరిశ్రమ. సంక్రాంతి నుంచి మునుపటి కళ రాకపోతే ఎలా అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చరిత్ర కలిగిన సింగల్ స్క్రీన్లు ఒక్కొక్కటిగా మూతబడుతూ ఉండటం మూవీ లవర్స్ ని కలవరపెడుతోంది