ఇంకో 39 రోజుల్లో పవర్ స్టార్ మేనియా మొదలుకాబోతోంది. అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్ల గ్యాప్ తో తమ అభిమాన హీరోని మళ్ళీ వెండితెర మీద చూడబోతున్నామన్న ఉత్సాహం అభిమానులను కుదురుగా ఉండనివ్వడం లేదు. అయితే ఇప్పటిదాకా భీకరమైన ప్రమోషన్ లాంటిదేమీ జరగకపోవడం వాళ్ళను కొంత అసంతృప్తికి గురి చేస్తున్నా వచ్చే నెల అంటే రేపు ప్రారంభం కాబోయే మార్చిలోనే రచ్చ మొదలవుతుందనని తమన్ ట్వీట్ చేయడం కొంత ఊరటనిస్తోంది. ఈ ఏడాదిలో క్రాక్ రేంజ్ ను మించిన ఓ పెద్ద హీరో సినిమా విడుదల వకీల్ సాబ్ దే అవుతుంది. బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్.
తాజా సమాచారం మేరకు వకీల్ సాబ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ చాలా భారీ మొత్తానికి కొన్నట్టు తెలిసింది. ఎంత ధర అనేది బయటికి రాలేదు కానీ అటుఇటుగా మాస్టర్ కు పెట్టిన పెట్టుబడే దీనికీ ఇచ్చారట. నిర్మాత దిల్ రాజు సైతం ఈ డీల్ పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలిసింది. థియేటర్లో రిలీజయ్యాక తక్కువ రోజుల్లోనే స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే అది ఎన్ని రోజులు అనేది తెలియాల్సి ఉంది. గతంలో దిల్ రాజు నిర్మించిన ఎంసిఏ, ఎఫ్2 లాంటి హిట్ సినిమాలు ప్రైమ్ లో త్వరగానే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రైమ్ అందుకే టెంప్ట్ చేసే ఆఫర్స్ ఇస్తుంది. వకీల్ సాబ్ కు సైతం ఇదే జరగొచ్చు.
శాటిలైట్ హక్కులను గతంలోనే జీ తెలుగుకి ఇచ్చిన వార్త గతంలోనే ప్రచారమయ్యింది. ఇక థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందనే మాట మాత్రం లీక్ కావడం లేదు. ఇంకా కొన్ని ఏరియాలు చర్చల్లో ఉన్నాయి. పవన్ రెగ్యులర్ మార్కెట్ తరహాలో మితిమీరిన రేట్లతో కాకుండా ఉభయకుశలోపరి తరహాలో డీసెంట్ గానే క్లోజ్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఏప్రిల్ 9న పోటీ వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ధనుష్ కర్ణన్ రిలీజ్ అదే రోజు ఫిక్స్ చేశారు కానీ తెలుగు వెర్షన్ రావడం అనుమానంగానే ఉంది. ఒకవేళ డిసైడ్ అయినా వకీల్ సాబ్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ పింక్ రీమేక్ కావడం ఇప్పటికే హైప్ ని పెంచేసింది.