iDreamPost
android-app
ios-app

వాళ్లకు టెన్షన్ తప్పిస్తున్న వకీల్ సాబ్

  • Published Nov 18, 2020 | 1:00 PM Updated Updated Nov 18, 2020 | 1:00 PM
వాళ్లకు టెన్షన్ తప్పిస్తున్న వకీల్ సాబ్

షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది కదా సంక్రాంతికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చూడొచ్చని గంపెడు ఆశలు పెట్టుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. వకీల్ సాబ్ ఆ టార్గెట్ ని చేరుకోవడం రాను రాను క్లిష్టంగా మారుతోంది. నిన్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక జనసేన కూడా బరిలో ఉంటుందని పవన్ అధికారికంగా చెప్పడంతో ఇంకో రెండు వారాలు ఆ వ్యవహారాల్లో బిజీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవసరమైతే అభ్యర్థుల తరఫున ప్రచారానికి కూడా వెళ్లాల్సి ఉంటుంది. అదే కనక జరిగితే ఇంకో ఇరవై రోజులు బ్రేకులు వేసుకోక తప్పదు.

నిజానికి నిర్మాత దిల్ రాజు కూడా పండగ మీద ఏమంత ఆసక్తిగా లేరట. ఇంకో రెండు మూడు నెలలు థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీ అనుమతులే కొనసాగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనవసరమైన రిస్క్ ఎందుకని బావిస్తున్నారట. ఎందుకంటే పవన్ రేంజ్ స్టార్ కి సగం సీట్లతో బిజినెస్ గిట్టుబాటు చేసుకోవడం కష్టం. బెనిఫిట్ షోలు పడాలి. తెల్లవారుఝామున హౌస్ ఫుల్ బోర్డులు పడాలి. అప్పుడే కోట్ల రూపాయల పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఇప్పట్లో ఈ విషయంలో సానుకూలంగా స్పందించే ఛాన్స్ తక్కువగానే ఉంది. అందుకే డ్రాప్ అవ్వడమే బెటర్.

ఈ లెక్కన చూస్తే వకీల్ సాబ్ వచ్చేది 2021 వేసవిలోనే. అది కూడా అన్నయ్య ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ లతో క్లాష్ కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పవన్ ది అసలే రీమేక్ సినిమా. ఉత్సాహం ఉన్నవాళ్లు హిందీ, తమిళ్ లో చూసేశారు. పింక్ ఓటిటిలో ఉంది. అందుకే అభిమానులు సైతం దీని గురించి మరీ ఓవర్ ఎగ్జైటింగ్ గా లేరు. కాబట్టి పోటీ లేకుండా సేఫ్ గేమ్ ఆడేలా చూసుకోవాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే దిల్ రాజు దసరా, దీపావళికి ఫ్యాన్స్ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ ని వదల్లేదు. సో ఇప్పటికే సంక్రాంతి రేస్ లో ఉన్న మీడియం రేంజ్ సినిమాలు రిలాక్స్ అవ్వొచ్చు