iDreamPost
iDreamPost
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం అనగానే సిపాయల తిరుగుబాటు.. ఉప్పు సత్యాగ్రహం.. సహాయ నిరాకరణ.. క్విట్ ఇండియా వంటి ఉద్యమాలు.. తిరుగుబాటులు గుర్తుకు వస్తాయి. అలాగే జలియన్ వాలాబాగ్ వంటి విషాదఘటనలు కూడా స్ఫూరణకు వస్తుంది. దేశ స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ సమావేశమైన వారిపై జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 391 మంది అమాయకులు మృతి చెందిన ఘటన దేశ స్వాతంత్య్ర పోరాటంలో రక్తాక్షరాలతో రాసిన చరిత్రగా నిలిచింది. ఇటువంటి దుర్ఘటన పచ్చని కోనసీమలో జరిగిందని.. పైరు పచ్చని పంటలు పండిస్తూ అందరికీ అన్నంపెట్టే రైతులు పోలీస్ కాల్పులకు అశువులుభాసారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో రైతుల రక్తం చిందించిన పోరాటానికి ఆత్రేయపురం మండలం వాడపల్లి వేదికగా నిలిచింది.
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి అనగానే ఏడు శనివారాల వెంకటేశ్వరస్వామి గుర్తుకు వస్తారు. ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని భక్తులు విశ్వసిస్తారు. రాష్ట్రంలో తిరుపతి, అన్నవరం, ఇంద్రకీలాద్రి, సింహాచలం, ద్వారకా తిరుమల తరహాలో వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి కూడా భక్తుల తాకిడి అందికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గత పదేళ్లలో భక్తుల సంఖ్య రానురాను పెరుగుతుంది. ఒక్క శనివారం రోజునే సుమారు 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేయడానికి వస్తారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ 15 వేల నుంచి 20 వేల మంది భక్తులు వస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయానికి ఆధ్యాత్మిక చరిత్ర ఒక్కటే కాదు.. స్వాతంత్య్ర పోరాట ఉద్యమ చరిత్ర కూడా ఉంది.
Also Read : కోనసీమ లో 186 ఏళ్లుగా జరుగుతున్న చెడీతాలింఖానా గురించి తెలుసా..?
రథోత్సవంలో రక్తం పారింది..
వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి రథోత్సవం ప్రతీ ఏటా చైత్రశుద్ధ ఏకాదశని నాడు నిర్వహిస్తుంటారు. 1931లో స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులు. మార్చి 30వ తేదీన స్వామివారిని రథం మీద ఉంచి మాడ వీధుల్లో ఊరేగింపునకు సిద్ధం చేశారు. ఉత్సవాల సందర్భంగా దేశభక్తి కట్టలు తెంచుకుంది. ఉత్సవాలను దేశ సమైకత్యను చాటేలా నిర్వహించాలని నిర్ణయించారు. స్వామివారి రథంపై జాతీయ జెండా, మహాత్మాగాంధీతోపాటు స్వాతంత్య్ర పోరాట ఉద్యమ నాయకుల ఫోటోలు ఉంచారు. అప్పటికే గాంధీజీ పిలుపు మేరకు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. గ్రామానికి చెందినవారే కాకుండా చుట్టుపక్కల మండలాలకు చెందిన స్వాతంత్య్ర పోరాట యోధులు తరలివచ్చారు.
రథోత్సవానికి బ్రిటీష్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినా ఉత్సవంలో జాతీయ జెండాను తొలగించేందుకు ఉద్యమకారులు అంగీకరించలేదు. అప్పటి రాజోలు సబ్ ఇనస్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు వాటిని తొలగించి కొంతమందిని అరెస్టు చేశారు. దీనితో ఉద్యమకారులు తిరగబడడంతో లాఠీచార్జీ వరకు వెళ్లింది. జలియన్ వాలాబాగ్ తరహాలో కనీసం హెచ్చరికలు కూడా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారు. వాడపల్లి ఆలయం వెలుపుల ఈ ఘటన చోటు చేసుకుంది. పారిపోతున్న అమాయక రైతుల మీద తూటాలు కురిపించారు. గ్రామ సమీపంలో ఉన్న ఏటిగట్టు మీదకు పారిపోయినవారిపై కూడా పోలీసులు వెంటబడి కాల్పులకు తెగబడ్డారు.
Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?
ఈ ఘటనలో నలుగురు ఉద్యమకారులు అక్కడికక్కడే మృతిచెందారు. నాటి కాల్పులలో కట్టుంగకు చెందిన కరుటూరి సత్యనారాయణ, ఆలమూరుకు చెందిన పాతపాటి వెంకటరాజు, వాడపల్లికి చెందిన వాడపల్లి గంగాచలం, బండారు నారాయణస్వామిలు మృతిచెందారు. పోలీసు కాల్పులలో 12 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
ఆలయం చెంత స్మారక చిహ్నం:
వాడపల్లి ఘటనకు సాక్షిగా ఆలయం సమీపంలో స్మారక చిహ్నన్ని ఏర్పాటు చేశారు. రథం.. దాని మీత జాతీయ జెండాలు, గాంధీ బొమ్మ, పోలీసు కాల్పులు, లాఠీచార్జీ, దేశభక్తుల మరణం, గాయపడం వంటి ఘటనలు జ్ఞప్తికి వచ్చేలా ఈ చిహ్ననాన్ని తీర్చిదిద్దారు. దాని దిగువున నాటి ఘటనలో మృతులు, గాయపడినవారి పేర్లను ఈ చిహ్నం మీద చెక్కారు. వాడపల్లి ఆలయం సమీపంలో ఘటన చోటు చేసుకున్న చోట ఈ చిహ్నం ఉంది.
Also Read : కోనసీమలో ఉన్న తమిళ ఊరు తెలుసా..?