iDreamPost
android-app
ios-app

వ్యాక్సిన్ వార్ : కొత్త టీకా పాల‌సీ.. స‌రికొత్త వివాదాలు

వ్యాక్సిన్ వార్ : కొత్త టీకా పాల‌సీ.. స‌రికొత్త వివాదాలు

కొద్ది నెల‌లుగా కేంద్రం అవ‌లంబిస్తున్న కొన్ని వివాదాలు వివాదాస్ప‌దంగా మారుతూ ఉన్నాయి. సాగు చ‌ట్టాలు, ప్రైవేటీక‌ర‌ణ విధానాలు త‌దిత‌ర అంశాల‌పై ఏదో రాష్ట్రంలో రాజ‌కీయ నిప్పుర‌వ్వ‌లు రాజుకుంటూనే ఉన్నాయి. అలాగే, క‌రోనా మొద‌టి ద‌శ‌కు, రెండో ద‌శ‌కు మ‌ధ్య చాలా గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేక‌పోవ‌డం కూడా వివాదాస్ప‌దంగా మారింది. ఇప్పుడు తాజాగా కొత్త టీకా పాల‌సీపై ప్ర‌తిప‌క్షాలు, ప‌లు రాష్ట్రాలు పెద‌వి విరుస్తున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు పై బ‌డిన అంద‌రికీ వ్యాక్సిన్ అన్న ప్ర‌క‌ట‌న ఎంత సంతోషాన్నిచ్చిందో, ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం, ఆయా సంస్థ‌ల‌కు బ‌హిరంగ మార్కెట్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంపై ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్ప నుంచి కేంద్ర, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ జ‌రుగుతూనే ఉంది. టీకా ధరలు కేంద్రానికి ఓ ధర…రాష్ట్రాలకు మరో ధర ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు.. కేంద్రానికి 150 రూపాయలకు.. రాష్ట్రాలకు 400 రూపాయలకు ఇచ్చే విధంగా వ్యాక్సిన్ పాలసీని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన కోవిడ్‌ టీకా విధానం పూర్తి వివక్షాపూరితంగా ఉందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి నిరంకుశ విధానాలతో నిండిన ఈ టీకా పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ అంశంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని సోనియా కోరారు. 18-45 ఏళ్ల లోపు భారతీయులందరికీ ఉచితంగా కోవిడ్‌ టీకా అందివ్వాలనే బాధ్యత నుంచి మోదీ సర్కార్‌ తప్పుకుంటుంద‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలందరికీ ఒకే ధరకు టీకా ఇవ్వాలని బాధ్యత గల వ్యక్తులెవరైనా ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వం ఆ బాధ్యతను నుంచి తప్పుకుంది అని సోనియా గాంధీ ఓ లేఖలో ఆరోపించారు. “ప్రస్తుత టీకా పాలసీ దేశంలోని అందరికీ అనువుగా లేదు. ఏడాదిగా కోవిడ్‌ నేర్పిన పాఠాలు, పౌరులు బాధలను చూసి కూడా మోదీ సర్కార్‌ ఇలాంటి వివక్షాపూరిత టీకా విధానం తేవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో ప్రస్తుత సవాళ్లు తగ్గకపోగా మరింత జఠీలమవుతాయి అని సోనియా అభిప్రాయపడ్డారు.

కోవిడ్‌ టీకాల తయారీ సంస్థ అయిన సీరమ్‌ సంస్థ తాజాగా వేర్వేరు ధరల శ్రేణిని ప్రకటించిన విషయాన్ని సోనియా ప్రస్తావించారు.కేంద్ర ప్రభుత్వానికి డోస్‌కు రూ.150 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వాలకు డోస్‌కు రూ.400, ప్రైవేట్‌ ఆస్పత్రులకు డోస్‌కు రూ.600 చొప్పున విక్రయిస్తామని సీరమ్‌, సంస్థ చెబుతోంది. ఇలా వేర్వేరు ధరలు ఉండటంతో పౌరులు అత్యధిక ధర చెల్లించి టీకాలను కొనాల్సిన దుర్భర పరిస్థితి తలెత్తింది. అధిక ధరకే రాష్ట్ర ప్రభుత్వాలూ కొనాల్సి రావడంతో రాష్ట్రాలకూ ఆర్థికంగా పెనుభారం అని సోనియా గాందీ కేంద్రప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు.

ధ‌న‌వంతుల‌కు మాత్ర‌మే..

దేశంలో ప్రస్తుత సంక్షోభానికి కరోనా వైరస్‌ మాత్రమే కారణం కాదని, మోదీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలూ కారణమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. “హోం క్వారంటైన్‌లో ఉన్న నాకు చెడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొవిడ్ కట్టడిపై కేంద్రం పనికీరాని ప్రసంగాలు, వివరణలు ఆపాలి దేశానికి పనికొచ్చే పరిష్కారం చూపాలి” అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. “పేద ప్రజలంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక సంఖ్యలాగానే కనిపిస్తుంది. కానీ వారు భారతీయ పౌరులు మధ్య తరగతి ప్రజలంతా పేదరికం బారిన పడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంతటి విధ్వంసం చేయాలో అంతా చేస్తోంది. కొత్త టీకా పాల‌సీతో ధ‌న‌వంతుల‌కు మాత్ర‌మే వ్యాక్సిన్ అందే అవ‌కాశాలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.

టీకా విధానం బూటకం

పలు రాష్ట్రాల్లో తగినన్ని కరోనా టీకా డోసులు అందుబాటులో లేని సమయంలో ప్రధాని మోదీ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికే విదేశాలకు టీకా ఎగుమతి చేశారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల దేశం.. టీకా కొరత సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ విధానం వట్టి బూటకమంటూ మోదీకి ఆమె లేఖ రాశారు. భారత్లో ఉన్న టీకాలను విదేశాలకు టీకా ఎగుమతి చేసి.. వ్యాక్సిన్ కొరత ఏర్పడిన సమయంలో.. బహిరంగ మార్కెట్లో అమ్మకాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుమతించారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. మహారాష్ట్ర, దిల్లీ, రాజస్థాన్, బంగాల్ వంటి రాష్ట్రాలు తగినన్ని టీకా డోసులు లేక సతమతమవుతోంటే.. ప్రధాని తన ప్రతిష్ఠను పెంచుకునేందుకు విదేశాలకు టీకా ఎగుమతి చేశారని దుయ్యబట్టారు. “బహిరంగ మార్కెట్లో టీకాలు అందుబాటులో ఉంటాయని ప్రధాని నిన్న ప్రకటించారు. అసలు ఎక్కడుందీ బహిరంగ మార్కెట్? ఎక్కడున్నాయి టీకాలు? మీరు ఎప్పుడో విదేశాలకు ఎగుమతి చేశారు కదా.” అని అన్నారు.

ద్వంద్వ ప్ర‌మాణాలు ఎందుకు…

జీఎస్టీ పన్నుల వసూళ్ల విషయంలో వన్ నేషన్ – వన్ ట్యాక్స్ పాలసీ అమల్లో ఉన్నప్పుడు… వ్యాక్సినేషన్ విషయంలో ఇలా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్‌ ద్వారా నిధులను సమకూర్చి.. దేశవ్యాప్తంగా ఉధృతంగా టీకా కార్యక్రమం జరిగేలా కేంద్రం చర్యలు చేపట్టవచ్చు కదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సబ్‌కా సాత్‌…సబ్‌కా వ్యాక్సిన్‌ అంటూ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. ప్రైవేటు ఆస్పత్రులకు 600 లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని కోవిషీల్డ్ ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఉత్పత్తి దారుల నుంచి నేరుగా రాష్ట్రాలు టీకాలను తీసుకునే వెసులుబాటు కల్పించడంతో… ఇకపై రాష్ట్రాలు నిర్ణీత ధరలకు వ్యాక్సిన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది.