iDreamPost
iDreamPost
తెలుగు సినిమా చరిత్రలో థియేటర్లలో విడుదల కాకుండా ఓటిటి తర్వాత నేరుగా బుల్లితెరపై విడుదలైన పెద్ద హీరో సినిమాగా ఇటీవలే జెమిని ఛానల్ లో నాని వి టెలికాస్ట్ చేశారు. దీనికన్నా ముందు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటివి వచ్చాయి కానీ అవి బడ్జెట్ పరంగా చిన్న సినిమాలు. ఫస్ట్ టైం ప్రీమియర్ కాబట్టి వికి టిఆర్పి రేటింగ్స్ భారీగా వస్తాయని అంచనా వేశారు. కానీ తీవ్రంగా నిరాశ పరుస్తూ వి కేవలం 6.8 రేటింగ్ తో సర్దుకుంది. ఇది షాకిచ్చే విషయమే. ఎందుకంటే బుల్లితెరపై మొదటిసారి కొత్త మూవీ వేసినప్పుడు సహజంగా 8 నుంచి 10 మధ్యలో కనీస రేటింగ్ రావాలి. అలాంటిది వి ఇంత తక్కువ సాధించడం ఆశ్చర్యం కలిగించేదే. ఎంత డిజాస్టర్ అయినా ఇంట్లో కూర్చుని చూసేది కాబట్టి మాములుగా అయితే ప్రేక్షకులు అధిక సంఖ్యలో చూస్తారు.
కానీ వి విషయంలో రివర్స్ జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. అమెజాన్ ప్రైమ్ లో వి సెప్టెంబర్ 5న స్ట్రీమింగ్ చేశారు. అంటే వంద రోజుల తర్వాత టీవీలో వచ్చింది. ఈలోగానే అధిక శాతం ఆడియన్స్ స్మార్ట్ ఫోన్ లలో, లోకల్ కేబుల్ ఛానల్స్ లో, పైరసీ వెర్షన్లలో యథేచ్ఛగా చూసేశారు. మూడు నెలల ఆలస్యం అంటే చాలా అంటే చాలా లేట్ అని చెప్పొచ్చు. సహజంగానే మళ్ళీ చూసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరచలేకపోయారు. ఈ ఆన్ లైన్లు, ఓటిటిలు అలవాటు లేని సగటు ప్రేక్షకులు మాత్రమే కొత్త సినిమా కదా చూద్దామని ఫిక్సయ్యారు. ఈ కారణంగానే వికి ఇంత తక్కువ స్పందన ఇచ్చింది.
ఇది ఒకరకంగా వార్నింగ్ గా చెప్పుకోవచ్చు. టెక్నాలజీ అరచేతుల్లోకి వచ్చి డిజిటల్ కంటెంట్ క్షణాల్లో వాలిపోతున్న ట్రెండ్ లో ఇలా నెలల తరబడి సాగదీస్తూ పోతే శాటిలైట్ ఛానల్స్ కు ముందుముందు ఇంకా ఇబ్బందులు తప్పవు. భీష్మ లాంటి బ్లాక్ బస్టరే సోసో రేటింగ్ తో గట్టెక్కింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో స్టార్లు ఉన్నారు కాబట్టి అవి రికార్డులు బద్దలు కొట్టి రిపీట్ వ్యూస్ తెచ్చుకున్నాయి కానీ మిగిలిన వాటికి అంత సీన్ ఉండదు. అందుకే ఇకపై ఓటిటికి శాటిలైట్ కి గ్యాప్ తక్కువగా ఉంటే తప్ప మునుపటి స్థాయిలో రేటింగ్స్ రావడం కష్టం. ఒకరకంగా చెప్పలంటే ఇది భీష్మ, విలు ఇచ్చిన వార్నింగ్ గా చూసుకోవచ్చు