iDreamPost
android-app
ios-app

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి స్వాగతం…

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి స్వాగతం…

కర్నూల్‌ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. పరాయిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతికగా నిలిచి బ్రిటీష్‌ పాలకుల ఉరికంభానికి 30 ఏళ్లపాటు వేలాడిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుతో అదే గడ్డపై ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పురుడుపోసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో నిర్మించిన ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం సీఎం జగన్‌మోహనరెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటుగా కేంద్రమంత్రి పి.హరిదీప్‌సింగ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని, అందుకే దీనికి ఆయన పేరునే పెట్టామని స్పష్టం చేశారు.

దీనిపై సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవితో సహా పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐదు ఎయిర్‌పోర్టులు ఉండగా ఆరో ఎయిర్‌పోర్టుగా ఓర్వకల్లు ప్రారంభమైందని పేర్కొన్నారు. కర్నూలు నుంచి ఇప్పటివరకూ బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించగా ఇకమీదట విమానాల్లో కూడా ప్రయాణించనున్నారు. రాయలసీమలో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. కడప, రేణిగుంటల్లో విమానాశ్రయాలు ఉన్న సంగతి తెలిసిందే.

20 ఏళ్ల కర్నూలు వాసుల కల

కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని గాలికొదిలేశాయి. చివరకు 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పచ్చజెండా పాలకులు ఊపారు.

అయితే 2017లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది కాలంలోనే పనులను పూర్తిచేస్తామని ప్రకటించారు. ఓర్వకల్లు , పూడిచెర్ల గ్రామాల్లో భూసేకరణ చేపట్టారు. ప్రభుత్వ భూమి రెండు వందల ఎకరాలు ఉండగా అదనంగా పట్టా భూమి మరో 810 ఎకరాలు సేకరించారు. ఈ విమానాశ్రయానికి గత ప్రభుత్వం 88.50 కోట్లను కేటాయించింది. ఈ నిర్మాణ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దనరెడ్డికి చెందిన కంపెనీకి అప్పగించడంతో భూసేకరణ, ఇతర పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది.

2019 సాధారణ ఎన్నికల నాటికి కేవలం 2.2 కిలోమీటర్ల రన్‌వే మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన పనులను అసలు మొదలుపెట్టలేదు. అయినా చంద్రబాబు నాయుడు 2019 జనవరి 18న హడావుడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించి అదే సంవత్సరం ఏప్రిల్‌ నుంచి విమానాల రాకపోకలు సాగుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇవన్నీ గాలిమాటలుగానే మిగిలిపోయాయి. తర్వాత అధికారం వైసీపీ చేపట్టింది. 2020 ఆగస్టులో ఈ విమానాశ్రయాన్ని పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అత్యాధునిక హంగులతో దీని నిర్మించాలని ఆదేశించారు. దానికి రూ 153 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి ప్రత్యేకతలు..

ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం మూడు విభాగాలుగా ఏర్పాటు చేశారు. మొదటి విభాగంలో ప్రతిపాదిత ఆఫ్రాన్‌ ఉంటుంది. అందులో ఎనిమిది విమానాలు నిలిపేందుకు అవకాశం ఉంటుంది. రెండో దానిలో మరమ్మతులకు గురైన విమానాలు నిలిపేందుకు ఐసోలేషన్‌ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విమానాల రాకపోకలు పెరిగే అవకాశం ఉండటంతో ఫ్యూచర్‌ ఆఫ్రాన్‌ నిర్మించారు. వీటితోపాటుగా రూ.7 కోట్ల వ్యయంతో ల్యాండింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. 18 కోట్లతో అత్యాధునిక అగ్నిమాపక శకటాలను అమెరికా నుంచి కొనుగోలు చేశారు. కెవిఆర్‌ ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ 62 కోట్లతో రెండు కిలోమీటర్ల రన్‌వేను నిర్మించారు. దాంతో పాటుగా ప్రహరి గోడ అంతర్గత రహదారులు పటిష్టంగా నిర్మాణాలు చేపట్టారు. తొమ్మిది కిలోమీటర్ల మేర సర్వీస్‌ రహదారి నిర్మించారు. రూ.26.50 కోట్లతో టెర్మినల్‌ భవనం, వాచ్‌ టవర్‌, ఏ.టి.సి భవంతి, వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌, విద్యుత్‌ సదుపాయం, జనరేటర్‌ వంటివి ఏర్పాటు చేశారు.

సీఎం జగన్‌ చొరవతో..

సీఎం జగన్‌ చొరవతోనే ఈ విమానాశ్రయం నూరు శాతం నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. 2017 జూన్‌ 21 విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో గానే పనులను పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కానీ ఆ పనులు ఏవి పూర్తి కాలేదు. అయినప్పటికీ 2019లో హడావిడిగా శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించినట్లు చూపించి చేతులు దులుపుకున్నారు. 2020 ఆగష్టులో ఈ విమానాశ్రయాన్ని పరిశీలించిన జగన్‌ అక్కడి పరిస్థితిని గమనించారు. వెంటనే విమానాశ్రయాన్ని పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా రూ 153 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఈ విమానాశ్రయం నూరు శాతం పనులు పూర్తి చేసుకుంది.

ఈ నెల నుంచి 28న తన సేవలను అందించనుంది. తొలి విమానం బెంగళూరు నుంచి కర్నూలు రానుంది. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బీసీఏఎస్‌ జనవరి 27న సెక్యూరిటీ క్లియరెన్స్‌ను మంజూరుచేసింది. దాదాపు 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో రన్‌వేను అభివద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. దాదాపు 18 నెలలోనే ప్రభుత్వం పనులను పూర్తిచేసింది.