అతి తక్కువ కాలంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారన్న విమర్శలను మూటగట్టుకున్న ఉత్తరాఖండ్లో తాజాగా గవర్నర్ బేబీ రాణి మౌర్య అనూహ్యంగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు పంపిన లేఖలో ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయ కార్యదర్శి ధృవీకరించారు. సాధారణంగా రాజ్యాంగ హోదా అయిన గవర్నర్ పదవుల్లో ఉన్నవారు సొంతంగా రాజీనామాలు చేయరు. అటువంటిది బేబీ రాణి హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
యూపీ రాజకీయాల్లోకి..
ఉత్తరప్రదేశ్ కు చెందిన బేబీ రాణి మౌర్య దళిత నాయకురాలు. 1990లలో ఆమె భారతీయ జనతాపార్టీలో చేరారు. 1995 నుంచి 2000 వరకు ఆగ్రా మొదటి మహిళా మేయర్ గా పనిచేశారు. 2007లో యూపీలోని ఇద్మత్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆమెను ఉత్తరాఖండ్ గవర్నరుగా నియమించింది.
Also Read:ఉప్పులేటి కల్పన వెన్నుపోటు పొడవకుండా వైసీపీలోనే ఉండి ఉంటే?
అయితే ఆమె ఉన్న ఫళంగా రాజీనామా చేయడం రాజకీయ చర్చలకు ఆస్కారమిచ్చింది. ఉత్తరాఖండ్ తోపాటు వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించేందుకే బీజేపీ హై కమాండ్ ఆమె చేత రాజీనామా చేయించిందని ప్రచారం జరుగుతోంది. దళిత నాయకురాలు అయినందున ఆమె సేవలు వినియోగించుకోవడం ద్వారా ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకోవచ్చని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఆదివారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో కలిసి వచ్చిన మూడు రోజులకే మౌర్య రాజీనామా చేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
గవర్నర్లు రాజీనామా చేయడం తక్కువ
రాజ్యాంగ పదవి అయిన గవర్నర్ హోదాలో ఉన్న వారు సొంతంగా రాజీనామాలు చేయడం దాదాపు జరగదు. అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలు ఎన్ని ఉన్నా సరే పూర్తి కాలం పదవిలో కొనసాగేందుకే మొగ్గు చూపుతారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వీరిని అయితే రీకాల్ చేయడం లేదా బదిలీ చేయడమో చేస్తుంటారు. ఇవన్నీ బేబీ రాణి మౌర్య హఠాత్ రాజీనామా వెనుక రాజకీయ కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు. కాగా ఉత్తరాఖండ్ బీజేపీ ఎన్నికల ఇంఛార్జిగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని, సహా ఇంఛార్జిగా ఎంపీ లాకెట్ చటర్జీని నియమించిన కొద్ది సేపటికే గవర్నర్ మౌర్య రాజీనామా చేయడం కూడా వేరే రకమైన అనుమానాలు రేకెత్తించింది.
Also Read : సూపర్ పోలీస్ అవ్వాలని ఏకంగా అంబానీకే స్కెచ్ వేసాడు…