దేశంలో కరోనా వైరస్ పలువురు ప్రముఖులను కబళిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు, సినీ నటులు కరోనా బారిన పడ్డారు. కొందరు కొలుకుంటే మరికొందరు మృత్యువాత పడ్డారు. తాజాగా ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా (50) కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య ధర్మాదేవి సైతం కరోనా వైరస్‌తోనే చనిపోయారు.
రెండు వారాల క్రితం బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కరోనా బారిన పడ్డారు. కరోనా నిర్దారణ కావడంతో ఆయనను ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్స కోసం తరలించారు. కాగా వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. కాగా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కాగా కరోనా వైరస్ సోకిన ఆయన భార్య గుండె పోటుతో మరణించారు.
సురేంద్ర సింగ్ జీనా 2006లో ఉత్తరాఖండ్ మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2007లో జరిగిన ఎన్నికల్లో సాల్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.తర్వాత వరుసగా 2012, 2017 ఎన్నికల్లోనూ సాల్ట్ నియోజకవర్గం నుంచే గెలుపొందారు.కరోనాతో పోరాడుతూ తనువు చాలించిన ఎమ్మెల్యే మరణంతో ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.