iDreamPost
iDreamPost
మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త సమస్యల్లో చిక్కుకుంటోంది. ఈ ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల ఆ పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పటికే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతు ఉద్యమాలు.. దానికి తోడు లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి తనయుడి కారు దూసుకుపోయి ప్రదర్శన చేస్తున్న నలుగురు రైతులతో సహా తొమ్మిది మంది మృతి చెందిన ఘటన అధికార బీజేపీని సంకట స్థితిలోకి నెట్టేసింది. యూపీకి పక్కనే ఉన్న మరో బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ ఆ పార్టీ ఊహకందని శరాఘాతంతో విలవిల్లాడుతోంది.ఏకంగా రాష్ట్ర మంత్రే పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం కమలనాథులకు మింగుడుపడటం లేదు.పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అసమ్మతితో అవస్థలు పడుతుండగా..ఎన్నికలకు ఐదు నెలల ముందు గట్టి పట్టున్న దళిత నేత పార్టీని విడిచిపెట్టడం విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళన కాషాయ దళంలో కనిపిస్తోంది.
కుమావ్ ప్రాంతంలో దెబ్బ
ఉత్తరాఖండ్‌ను భౌగోళికంగా తెహ్రి గద్వాల్, కుమావ్ ప్రాంతాలుగా చూస్తారు. అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 సీట్లలో ఆరు జిల్లాలతో కూడిన కుమావ్ ప్రాంతంలో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరు ఎస్సీ నియోజకవర్గాలు. గత ఎన్నికల్లో బీజేపీ ఈ ప్రాంతంలో 23 స్థానాలను దక్కించుకోగా, అందులో ఐదు ఎస్సీ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. కుమావ్ ప్రాంతానికే చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి,దళిత నేత అయిన యశ్ పాల్ ఆర్యకు ఈ ప్రాంతంపై మంచి పట్టుంది.ఆయన వల్లే గత ఎన్నికల్లో బీజేపీ ప్రాబల్యం చూపగలిగిందన్న వాదన ఉంది.అటువంటి నేత కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అవకాశాలకు గండి కొడుతుందని అంటున్నారు.అదే సమయంలో కాంగ్రెస్‌కు లాభిస్తుందని చెప్పొచ్చు.
Also Read : యూపీ కాంగ్రెస్‌లో ఆశలు రేపుతున్న ప్రియాంక
అసంతృప్తిని చల్లార్చని సీఎంల మార్పు
2017లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.మొదట త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడేళ్లకే ఆయనపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఈ ఏడాది మార్చిలో ఆయనని తప్పించి తీరథ్ సింగ్‌ను బీజేపీ అధిష్టానం సీఎం పదవిలో కూర్చోబెట్టింది.ఎంపీగా ఉన్న నేతను తీసుకొచ్చి సీఎం చేయడం పార్టీ ఎమ్మెల్యేల్లో మరింత అసంతృప్తి రగిల్చింది.మరోవైపు కోవిడ్ సమయంలో కుంభమేళాలో రద్దీని నియంత్రించలేకపోవడం..దానికి వచ్చిన కోట్లాది మందికి కరోనా టెస్టులు చేశామని తప్పుడు లెక్కలు చెప్పడం వంటి ఆరోపణల నేపథ్యంలో..తీరథ్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్న సాకుతో నాలుగు నెలల్లోనే అతన్ని తప్పించి జూలైలో పుష్కర్ సింగ్ ధామీని కుర్చీ ఎక్కించారు.ఆయనకు సీఎం పదవి ఇవ్వడం యశ్‌పాల్ ఆర్యతో సహా పలువురు ఎమ్మెల్యేలకు రుచించలేదు.
అందువల్లే మంత్రి యశ్‌పాల్ ఆర్యతోపాటు ఆయన తనయుడు,ఎమ్మెల్యే సంజీవ్ ఆర్య బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు.త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీని వీడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.ప్రస్తుత పరిస్థితిని కొందరు 2011 నాటి పరిస్థితితో పోల్చుతున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న రమేష్ పోఖ్రియాల్‌ను 2012 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు తప్పించి బీసీ ఖండూరిని సీఎంగా నియమించారు.తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందేమోనన్న అనుమానం బీజేపీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మంత్రి యశ్ పాల్ ఆర్య