iDreamPost
iDreamPost
యువతరం, వృద్ధతరం మధ్య అంతరాలు ఎప్పుడూ ఉండేవే. వాళ్ళేమో అన్నీ చేసేస్తామంటారు? వీళ్ళేమో ఆత్రం వద్దంటారు?. ఒక రకంగా రెండూ తప్పే. రెండింటికీ మధ్యేమార్గం ఒకటుంటుంది. యువతరం వేగానికి, వృద్ధతరం అనుభవానికి లంకె కుదిరితే అద్బుత ఫలితాలే ఉంటాయి. ఇటువంటి సంయమనం రాజకీయాల్లోనైతే మరింత మంచి ఫలితాలకు ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ సమన్వయం కంటే పైచేయి సాధించాలన్న అంతరాభిప్రాయాలు నెలకొంటే మాత్రం ఇరువర్గాలకు మధ్య అగాధం పెరిగిపోవడం ఖాయం. ఆ అగాధం పూడ్చలేనంతగా ఉంటే, పార్టీపై ప్రజల్లో నమ్మకం పోవడం తథ్యం.
ప్రస్తుతం కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు పరిశీలకులు. ఇప్పటికి రెండు సార్లు ఓడిపోయి పడుతూ లేస్తూ బండిలాక్కొస్తున్న కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు గుదిబండగా మారిపోయాయంటున్నారు. నిజానికి వరుసగా రెండుసార్లు గెల్చిన పార్టీపై ఎంతో కొంత ప్రజల్లో అసంతృప్తి ఉండడం సహజం. అటువంటి అవకాశం కోసం ప్రతిపక్షం కాచుక్కూర్చుని ఎదురుదాడి చేయడం రాజకీయాల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నవారిపై దాడిచేయడానికంటే ముందు తమ సైన్యాన్ని కాపాడుకోవాల్సిన దీనపరిస్థితి కాంగ్రెస్‌పార్టీకి ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొందరు కలిసి అధిష్టానానికి లేఖరాయడంతో మొదలైన అంతరాలు ఇప్పటిక్కూడా ఇంకా కొలిక్కొస్తున్న దాఖాల్లేవు. నేనుండలేను మోర్రో.. అంటున్నప్పటికీ సోనియాగాంధీనే అధ్యక్షురాలిగా పెట్టుకోవాల్సి వచ్చింది. నువ్వే అధ్యక్షుడివి అంటుంటే వద్దు పొమ్మంటున్నాడు రాహుల్‌బాబు. పార్టీలోని యువతరం, వృద్ధతరం మధ్య ఏర్పడిన అంతరం ఇప్పుడు ఈ తల్లీకొడుకులను కూడా చెరోవర్గానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితులను సృష్టించినట్లయింది.
అయితే అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి ఒకరిద్దరు నాయకులపై కొరఢాఝుళిపించినట్లే కన్పించిన సోనియా, సీనియర్లు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా మరోమారు చెప్పడంతో ఇప్పుడు పునరాలోచనలో పడినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్గత చర్చలకు ప్రాధాన్యమివ్వడాన్ని ఉదాహరణ చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనేది అత్యంత సాఫీగా జరగాల్సిన పరిస్థితుల్లో బజారున పడ్డ కాంగ్రెస్ పార్టీపై.. జనం ‘‘అయ్యోపాపం’’ అని నిట్టూర్చడం తప్ప వారి వైపు మొగ్గుచూపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఈ మాట అనేకంటే అందుకు తగ్గ భరోసాను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతోందని చెప్పడమే కరెక్టుగా ఉంటుందన్నది పలువురి అభిప్రాయం.
ఒకప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాటమాత్రంగా శాసించిన స్థితి నుంచి సొంత పార్టీలోనే యువతరం, వృద్ధతరం మధ్య సయోధ్య కుదర్చలేని పరిస్థితులకు దిగజారడం చూస్తుంటే.. ఓడలు–బళ్ళు సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ అనక తప్పదు.