iDreamPost
iDreamPost
ఉప్పాడ.. బంగాళాఖాతంలో ఏ చిన్న అలజడి ఏర్పడినా ఇక్కడ ఇల్లు కడలి గర్భంలో కలిసిపోతుంటాయి. ఎగిసిపడే కెరటాలకు రహదారులు చిద్రమైపోతాయి. దీనితో ఈ గ్రామాన్ని ఆనుకుని కొత్తగ్రామం నిర్మించుకోవాల్సి వస్తుంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. సముద్రంలో ఏ చిన్న అలజడి రేకెత్తినా చాలు సముద్ర కెరటాలు ఎగిసిపడి గ్రామం కోత బారిన పడుతుంది. గ్రామ గుండె కోతకు భౌగోళిక మార్పులే కాదు… మానవ తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ గ్రామం మరోసారి కోతకు గురవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర అలలు ఎగిసిపడడంతో గ్రామం కడలిలో కొట్టుకుపోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల గురువారం కోత తీవ్రత అధికంగా ఉంది. ఉప్పాడ బీచ్ రోడ్డు మరోసారి దెబ్బతినేలా కెరటాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే పాత ఉప్పాడ గ్రామం మూడొంతులు కోతకు గురైంది. గుడి.. బడి.. రోడ్డు.. ఇళ్లు అనే తేడాలేదు. సర్వం కడలి గర్భంలో కలిసిపోతోంది. 342.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండే పాత గ్రామం గత వందేళ్లలో 320 ఎకరాలు కోతకు గురైంది. 410 ఎకరాల్లో సరుగుడు తోటలు, పంట పొలాలు ఉండగా, 320 ఎకరాల భూమి కొట్టుకుపోయింది. తీరం నుంచి కిలో మీటరు మేర సముద్రం చొచ్చుకుని వచ్చింది. సముద్ర కోత వల్ల మత్స్యకారులు అధికంగా నష్టపోతున్నారు. వారితోపాటు పలువురి ఇళ్లు కోతకు గురికావడంతో గ్రామంలో పడమరవైపు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పాత ఉప్పాడ గ్రామం చాలా వరకు కనుమరుగైంది. దాని స్థానంలో కొత్త గ్రామం పుట్టుకువచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. కాకినాడ నుంచి తుని వరకు సముద్ర తీరంలో నిర్మించిన బీచ్ రోడ్డు ఇప్పటి వరకు 30 సార్లు కోతకు గురైంది.
అక్కడ రక్షణ… ఇక్కడ గుండెకోత
ఉప్పాడ కోతకు ప్రధాన కారణం సమీపంలో ఉన్న హోప్ ఐలెండ్. కాకినాడ పోర్టుకు, నగరానికి సముద్రం నుంచి రక్షణ కవచంగా ఉన్న ఈ హోప్ ఐలెండ్ ఉప్పాడ కోతకు కారణమవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు 1950లోనే గుంర్తించారు. హోప్ ఐలెండ్ కారణంగా కాకినాడ పోర్టు సమీపంలో కెరటాలు ఉండవు. తీరానికి చేరే కెరటాలు ఉధృతి ఉప్పాడను తాకుతుంది. ఈ కారణంగా కాకినాడ వాకలపూడి నుంచి ఉప్పాడ గ్రామం దాటే వరకు కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. హోప్‌ఐలెండ్‌కు సమీపంలోనే గోదావరి నదీపాయలు సముద్రంలో కలుస్తాయి. గోదావరి ద్వారా కొట్టుకు వచ్చే ఇసుక హోప్ ఐలెండ్ సమీపంలో ఇసుక మేటలు వేస్తున్నాయి. ఇదే సమయంలో ఉప్పాడ వద్ద కోతకు గురవుతుంది. అలాగే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో పెద్ద పెద్ద నౌకలు వచ్చేందుకు వీలుగా తరచూ డ్రెజ్జింగ్ చేస్తుంటారు. వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగిస్తున్నారు. డ్రెజ్జింగ్ తరువాత సముద్రలోతున తిరిగి ఇసుక సహజంగా పూడుకుపోతుంటుంది. ఈ ఇసుక ఉప్పాడ సమీపం నుంచి డీప్ వాటర్ పోర్టు వరకు కొట్టుకుని వస్తుండడం వల్ల ఇక్కడ కెరటాల ఎగిసిపడడంతో పాటు సముద్రం చొచ్చుకుని వెళ్లడం వల్ల కూడా ఉప్పాడ కోతకు కారణమువుతుంది.
వైఎస్సార్ హాయాంలో రక్షణ గోడ
ఉప్పాడ సముద్రకోత నివారణకు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీకారం చుట్టారు. తొలుత ఇక్కడ కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా ఇసుక వేయాలని నిర్ణయించారు. అలా చేయడం వ్యయప్రయాసాలతో కూడుకున్న అంశం కావడంతో దాని స్థానంలో రూ.31 లక్షలతో రక్షణ గోడ నిర్మించారు. అది కూడా కొట్టుకుపోయింది. దీనితో వైఎస్సార్ హాయాంలో జియోట్యూబ్‌ను నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఎస్‌సీఎం) సూచన మేరకు నిర్మించారు. ఇందుకు రూ.12 కోట్ల నిధులను వైఎస్సార్ మంజూరు చేశారు. తొలి రోజుల్లో కోత చాలా వరకు తగ్గింది. తరువాత దీనిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇది కూడా నిరుపయోగంగా మారుతోంది. ఇక్కడ కోత తీవ్రతను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కేంద్రం ధృష్టికి తీసుకుని వెళ్లగా, కేంద్ర బృందం పరిశీలనకు వచ్చింది. దీనితో కోత నివారణకు ఈసారి పటిష్టమైన చర్యలు తీసుకునే అవకాశముందని స్థానికులు ఆశపడుతున్నారు.