iDreamPost
iDreamPost
థియేటర్లు తెరుచుకోవడం గురించి కాసేపు పక్కన పెడితే ఓటిటి ఎంటర్ టైన్మెంట్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇవాళ నారప్ప ప్రీమియర్ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఆసక్తికరంగా మారింది. మరికొందరు నిర్మాతలు కూడా ఇదే దారి పట్టొచ్చనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ముఖ్యంగా ఆగస్ట్ నెలలో ఓటిటి ప్రీమియర్ల జోరు మహా ఆసక్తికరంగా ఉండబోతోంది. అన్ని భాషల్లోనూ డిజిటల్ విడుదలలు హోరెత్తబోతున్నాయి. ఇప్పటికి కన్ఫర్మ్ చేసుకున్న వాటిలో మొదటిది నితిన్ ‘మాస్ట్రో’. ఇటీవలే ఫైనల్ సాంగ్ షూట్ పూర్తి చేసుకున్న టీమ్ త్వరలోనే ఫైనల్ కాపీ సిద్ధం చేయబోతోంది. అఫీషియల్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
అంతర్గత సమాచారం మేరకు మాస్ట్రోని ఆగస్ట్ 15న ప్రీమియర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలుత 13న అనుకున్నప్పటికీ అదే రోజు హాట్ స్టార్ భారీ మల్టీ స్టారర్ ‘భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా’ని షెడ్యూల్ చేసింది. దాని మీద హైప్ మాములుగా లేదు. దీనికి ముందు 12న ప్రైమ్ లో ‘షీర్షా’ రాబోతోంది. వార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో విడుదల కోసం వెయిటింగ్ లో ఉన్న కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ‘నరగాసురన్’ కూడా 13న సోనీ లివ్ ద్వారా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలిసింది. మాస్ట్రో కాకుండా మిగిలిన మూడు సినిమాలు తెలుగు డబ్బింగ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు
వీటితో పాటు ఆగస్ట్ రెండు మూడు వారాలను టార్గెట్ చేసుకుని మరికొన్ని సినిమాలు ఓటిటిలో వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. థియేటర్లు ఆ టైంకంతా తెరుచుకున్నప్పటికీ చిన్న సినిమాలకు స్క్రీన్లు దొరకడం అంత సులభంగా ఉండదు. పైగా ప్రతి శుక్రవారం విపరీతమైన పోటీ నెలకొంటుంది. అందుకే ఒకవేళ ఓటిటిలు కనక మంచి ఆఫర్లు ఇస్తే మరికొన్ని డీల్ సెట్ చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఇటీవలే నిర్మాత సురేష్ బాబు చెప్పినట్టు ఇకపై థియేటర్లు ఓటిటి సమాంతర వ్యవస్థగా కొనసాగే పరిస్థితి కళ్ళముందు కనిపిస్తోంది. ఇదంతా కరోనా పుణ్యమే అయినా ఎగ్జిబిషన్ రంగం మీద పడబోయే ప్రభావం మాత్రం చాలా ఎక్కువ