ఉత్తర ప్రదేశ్ లోని మథురా జిల్లాకు చెందిన రిక్షావాలాలకు ఓ విచిత్ర సంఘటన ఎదురైంది. రోజువారి శ్రమ ఆధారంగా జీవనం సాగించే ఓ రిక్షావాలకు.. మూడు కోట్ల రూపాయల పన్నుకట్టాలంటూ ఐటీ శాఖ నోటీసు జారీ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సదరు రిక్షావాలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
మథుర జిల్లాలోని బకల్పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్, రిక్షా తొక్కుతూ తద్వారా వచ్చే ఆదాయంతో జీవనం గడుపుతూ ఉంటాడు. అతడికి స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో అకౌంట్ ఉంది. దానికి పాన్ కార్డు ను యాడ్ చేయాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో జన్ సువిధ కేంద్రంలో ఈ ఏడాది మార్చిలో అప్లై చేశాడు. కొన్ని రోజుల తర్వాత సంజయ్ సింగ్ అనే వ్యక్తి, ప్రతాప్ సింగ్ కు పాన్ కార్డ్ కలర్ జిరాక్సు అందజేయగా… అదే ఒరిజినల్ కార్డుగా ప్రతాప్ భావించాడు. తనకు చదవు రాకపోవడంతో అది నకిలీనో, అసలు పాన్ కార్డో తెలుసుకోలేకపోయానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ప్రతాప్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతాప్ సింగ్ కు అక్టోబర్ 15న ఐటీ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. సుమారు రూ.3.47 పన్ను చెల్లించాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. దీంతో బెంబేలుపడిపోయిన ప్రతాప్ సింగ్.. తాను రిక్షావాలానని అంత పన్ను చెల్లించడమేంటని ప్రశ్నించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అధికారులు.. ప్రతాప్ సింగ్ పేరుతో వేరే వ్యక్తి జీఎస్టీ నంబరు పొంది వ్యాపారం చేస్తున్నారని గుర్తించారు. ఆ కంపెనీ ప్రస్తుతం 43 కోట్ల రూపాయల లావాదేవీలు చేపట్టినట్లు నిర్ధారించి, విషయాన్ని ప్రతాప్ సింగ్ కు వివరించారు. ఈ విషయంపై వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రతాప్ సింగ్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనపై విచారణ చేపడతామని పోలీసు అధికారులు వెల్లడించారు. తనకు చదువురాకపోవడంతో మోసపోయానని చెబుతున్న ప్రతాప్ సింగ్.. న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు.జరిగిన పరిణామాలను ఓ సెల్ఫీ వీడియోను ప్రతాప్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read : Financial Experts – కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికవేత్తలు ఎందుకు వెళ్లిపోతున్నారు?