iDreamPost
android-app
ios-app

యూపీలో తగ్గిన పోలింగ్ దేనికి సంకేతం?

  • Published Feb 11, 2022 | 1:30 PM Updated Updated Feb 11, 2022 | 1:30 PM
యూపీలో తగ్గిన పోలింగ్ దేనికి సంకేతం?

ఉత్తరప్రదేశ్లో ఏడు దశల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియలో తొలి ఘట్టం చెదురుముదురు ఘటనల మధ్య పూర్తి అయింది. అయితే పోలింగ్ శాతమే రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. తొలిదశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల పరిధిలో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా 62 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికల్లో సహజంగా భారీ పోలింగ్ నమోదు అవుతుంటుంది. ఆ లెక్కన 75 నుంచి 80 శాతం ఓట్లు పోలవుతాయని అందరూ భావించారు. కానీ చివరికి 62 శాతం దగ్గరే ఆగిపోయింది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి 58 శాతం మాత్రమే నమోదైంది. చివరి గంటలో వచ్చి లైన్లలో నిలబడినవారికి అవకాశం ఇవ్వడంతో చివరికి 62 శాతంగా తేలింది. ఇంత తక్కువ పోలింగ్ జరగడం ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందన్న చర్చ మొదలైంది. పోలింగ్ తమకే అనుకూలంగా జరిగిందని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల ఆందోళనగానే లెక్కలు వేసుకుంటున్నాయి.

అధికార మార్పునకు సంకేతమా

ఏ ఎన్నికల్లో అయినా పోలింగ్ తగ్గడం ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని తొలి నుంచి ఒక అంచనా అభిప్రాయం ఉన్నాయి. ప్రభుత్వం, అధికార పార్టీపై అసంతృప్తి ఉన్నప్పుడు ప్రజలు ఓటు వేయకుండా దాన్ని వెల్లడిస్తుంటారు. ప్రస్తుత తొలిదశ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లోనూ తక్కువ పోలింగ్ జరిగింది.

2012లో 61.03 శాతం, 2017లో 63.75 శాతం పోలింగ్ జరిగింది. ఆ రెండు ఎన్నికల్లోనూ అధికార పార్టీలు మట్టి కరిచాయి. 2012లో అధికార బీఎస్పీ ఓడిపోయి ఎస్పీ అధికారంలోకి రాగా, 2017లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రకారం చూస్తే మొదటి దశ పోలింగ్ తగ్గడం అధికార బీజేపీకి నష్టమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వ్యవసాయ చట్టాల ప్రభావం.. 

మొదటి దశలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాలన్నీ పశ్చిమ యూపీలోనే ఉన్నాయి. ఇవన్నీ జాట్ రైతుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు. వీటిలో దాదాపు సగం నియోజకవర్గాల్లో 35 శాతం జనాభా జాట్లే ఉంటారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వీరే కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభావం ఎన్నికలపై ఉందని అంటున్నారు. అదే నిజమైతే, తగ్గిన పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమన్న అంచనాలు వాస్తవమైతే గత ఎన్నికల్లో 58లో 53 సీట్లు నెగ్గిన బీజేపీకి ఈసారి కష్టమేనని అంటున్నారు. మొదటిదశ పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్న పార్టీలు మిగతా దశల్లో అధిక పోలింగ్ జరిపించేలా వ్యూహాలు రచిస్తున్నాయి.