iDreamPost
android-app
ios-app

Up ,MIM- యూపీ బరిలో మజ్లిస్ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

  • Published Nov 23, 2021 | 7:20 AM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Up ,MIM- యూపీ బరిలో మజ్లిస్ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

ఢిల్లీ సింహాసనానికి గేట్ వే.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అన్ని పార్టీలను ఆకర్షిస్తోంది. ఇంతవరకు ఆ రాష్ట్రంలో ఉనికి లేని పార్టీలు కూడా అక్కడ అడుగు మోపాలని ఆరాటపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెసుతో పాటు తెలంగాణలోని హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్(ఎంఐఎం) పార్టీలు అవే ప్రయత్నాల్లో ఉన్నాయి. దాంతో వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ ఖాయమని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా యూపీ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటన యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా ముస్లిం ఓటుబ్యాంక్ పైనే ఆధారపడే మజ్లిస్ బరిలో ఉంటే.. ఆ పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే.. దాని ప్రభావం ఏ పార్టీ మీద ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

మజ్లిస్ లో ఆశలు రేపుతున్న ముస్లిం జనాభా

పెద్ద రాష్ట్రమైన యూపీలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. అక్కడ ప్రధాన వర్గాల్లో ముస్లిం మైనారిటీలు ఒక వర్గం. రాష్ట్రంలో వీరి సంఖ్య దాదాపు 4.50 కోట్లు అంటే 19.3 శాతం అన్నమాట. అనేక నియోజకవర్గాల్లో వీరి ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ అంశమే మజ్లిస్ ను పోటీ చేయమని ఊరిస్తోంది. ఇటీవలి కాలంలో తమ పార్టీని తెలంగాణకు బయట విస్తరించాలని ఒవైసీ ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ముందు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసి 5 సీట్లు సాధించారు. అదే క్రమంలో ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్క సీటైనా దక్కించుకోలేక పోయింది. తాజాగా యూపీపై ఆ పార్టీ దృష్టి సారించింది. త్వరలో జరిగే ఎన్నికల్లో 100 సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు.

ఓట్ల చీలిక అనివార్యం

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), బీఎస్పీల మధ్య పోటీ కేంద్రీకృతం అయ్యింది. కాంగ్రెస్ కూడా శక్తియుక్తులను ఒడ్డుతున్నా.. పోటీ ఇచ్చే స్థాయిలో లేదని అంచనా. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి గద్దె దించాలన్నది ఈ పార్టీల లక్ష్యం. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు గతంలో కాంగ్రెస్.. ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీల వెంట ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మజ్లిస్ రంగంలోకి దిగితే ఆ వర్గం ఓట్లు ఈ పార్టీల మధ్య చీలిపోతాయి. గెలుపు అవకాశాలు దెబ్బతింటాయి. ఇది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుందంటున్నారు. అలా కాకుండా మజ్లిస్ బీజేపీయేతర పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యి ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీని బలంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ పొత్తుల విషయాన్ని అసదుద్దీన్ ప్రస్తావించలేదు. పొత్తు కుదుర్చుకోవాలని అనుకున్నా ఏకంగా 100 సీట్లు ఇచ్చేందుకు ఏ పార్టీ కూడా అంగీకరించదు.

బీజేపీ నెత్తిన పాలుపోసినట్లే!

వంద సీట్లలో పోటీ చేయాలన్న మజ్లిస్ నిర్ణయం అసలే కష్టాల్లో ఉన్న బీజేపీ నెత్తిన పాలు పోసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతు ఉద్యమాలు, శాంతిభద్రతలు, కరోనా వైఫల్యాలు వంటి వాటితో గత ఏడాదిన్నర కాలంలో యూపీలో బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోంది. ప్రీ పోల్ సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీదే మళ్లీ అధికారమని వెల్లడైనా.. ప్రస్తుత అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న 315 స్థానాల్లో దాదాపు వంద తగ్గి 225 సీట్లకే పరిమితం కావచ్చని సర్వేలు అంచనా వేశాయి. దాంతో అప్రమత్తం అయిన కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం అందులో భాగమే. ఈ నేపథ్యంలో మజ్లిస్ కనుక వంద సీట్లలో పోటీకి దిగితే బీజేపీకి అది ఆయాచిత వరంగా మారుతుందని అంటున్నారు.