iDreamPost
android-app
ios-app

up elections, priyanka gandhi, women card – యూపీలో ప్రియాంక మహిళా మంత్రం పనిచేస్తుందా?

  • Published Dec 06, 2021 | 6:21 AM Updated Updated Dec 06, 2021 | 6:21 AM
up elections, priyanka gandhi, women card – యూపీలో ప్రియాంక మహిళా మంత్రం పనిచేస్తుందా?

ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ఉత్తరప్రదేశ్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగి పోటాపోటీగా ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నాయి. వారి మనసు దోచి ఓట్లు కొల్లగొట్టేందుకు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. వరాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రత్యేక నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలైన బీజేపీ, సమాజ్వాదీ పార్టీలకు ధీటుగా కాంగ్రెస్ కూడా ఓటర్ల విశ్వాసం చూరగొని గత వైభవం పొందడానికి ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల బాధ్యతను నెత్తికెత్తుకున్న ప్రియాంక గాంధీ గెలుపు కోసం ప్రధానంగా మహిళా ఓటర్లనే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.

యూపీలో మొత్తం 14 కోట్ల ఓటర్లు ఉండగా అందులో 7 కోట్లకు కొంచెం తక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగాలంటూ ‘లడికీ హుం.. లడ్ సక్తీ హుం’ (మహిళలమైనా పోరాడగలం) అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 100 రోజుల్లో ఈ నినాదాన్ని రాష్ట్రంలోని 7 కోట్ల మహిళల చెంతకు చేర్చాలని కార్యాచరణ అమలు చేస్తున్నారు. అంతకుముందు ఆక్టోబరులో ఆమె యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని ప్రకటించారు. అంటే మొత్తం 403 సీట్లలో 162 వరకు మహిళా అభ్యర్థులకే ఇవ్వాల్సి ఉంటుంది. టెన్త్, డిగ్రీ చదివే యువతులకు స్కూటీలు, ల్యాప్టాప్ లు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ మహిళామంత్రం పనిచేస్తుందా.. ఇదొక్కటే ఎన్నికల్లో విజయం చేకూర్చగలదా అన్న చర్చ జరుగుతోంది.

గత చరిత్ర ఏం చెబుతోంది?

దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీ గత ఎన్నికల చరిత్ర పరిశీలిస్తే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల సంఖ్యే తక్కువ.. వారిలోనూ విజయం సాధించిన వారి సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. 2002 నుంచి 2017 మధ్య జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో 713 మంది మహిళలు పోటీ చేయగా 137 మందే గెలిచారు. అంటే వారి విజయ శాతం 19.21 మాత్రమే. 2000 తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలనే తీసుకుంటే పోటీ చేసిన 153 మందిలో 29.41 శాతం.. అంటే 45 మందే గెలుపొందారు.

Also Read : Up – ఉత్తరప్రదేశ్‌… అస్థిరత్వం నుంచి స్థిరత్వం వైపు…

అసెంబ్లీ ఎన్నికలవారీగా చూస్తే.. 2002లో 184 మంది పోటీ చేస్తే 31 మందే (16.84 శాతం) గెలిచారు. 2007లో పోటీ చేసిన 154 మందిలో 25 మంది (16.23 శాతం), 2012లో 224 మంది రంగంలో ఉంటే 39 మంది (17.41 శాతం), 2017లో పోటీ చేసిన 151 మందిలో 42 మంది (27.81 శాతం) మాత్రమే విజయం సాధించగలిగారు.

పార్లమెంట్ ఎన్నికల విషయంలో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 2004లో 29 మంది పోటీ చేయగా 8 మంది (27.58 శాతం), 2009లో 33 మందికి గాను 13 మంది (39.39 శాతం), 2014లో పోటీ చేసిన 55 మందిలో 13 మంది (23.63 శాతం), 2019లో 36 మంది పోటీ చేస్తే 11 మంది (30.55 శాతం) మాత్రమే గెలుపు బాటలో పయనించారు.

మహిళలే ప్రాతిపదిక కాదు.. 

గతంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చిన సందర్భం 2017లో మాత్రమే ఉంది. ఆ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 46 మంది మహిళలకు టికెట్లు ఇచ్చి 36 మందిని గెలిపించుకోవడంతో పాటు అధికారంలోకి వచ్చింది. 2002లో కాంగ్రెస్ 34 మందిని నిలబెడితే ఇద్దరు మాత్రమే గెలిచారు. అదే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 29 మందిని పోటీకి పెట్టి 14 మందిని గెలిపించుకోవడంతోపాటు అధికారంలోకి వచ్చింది. 2007లో అత్యధికంగా 37 మంది మహిళలను కాంగ్రెస్ నిలబెట్టగా ఒక్కరే గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన 16 మందిలో 12 మంది గెలవడమే కాకుండా ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఇక 2012లో బీజేపీ నుంచి పోటీ చేసిన 46 మందిలో 8 మందే గెలిచారు. అదే సమయంలో ఎస్పీ 41 మందిని రంగంలోకి దించి 21 మందిని గెలిపించుకుంది. ఆ పార్టీయే అధికారం చేపట్టింది. ఈ గణాంకాలను చూస్తే ఎక్కువమంది మహిళలను నిలబెట్టినంత మాత్రాన మహిళలు గంపగుత్తగా ఓట్లు వేయరని.. అధికారం దక్కదని స్పష్టం అవుతోంది. ఎన్నికల్లో మహిళా అజెండా ఒక ముఖ్యమైన అంశమే అయినా.. మిగిలిన అంశాల్లోనూ ఓటర్ల విశ్వాసం చూరగొంటేనే అధికారం లభిస్తుందని అంటున్నారు.

Also Read : Uttar Pradesh, Akhilesh Yadav – బీజేపీతో పోరాటానికి.. అఖిలేష్‌ ‘‘ఇంద్రధనస్సు’’