iDreamPost
iDreamPost
మరో నాలుగు నెలల్లో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు పాదయాత్రలు, ర్యాలీలతో హోరెత్తుస్తున్నాయి. పోటాపోటీగా ఎన్నికల వరాలు వెదజల్లుతున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలతో పాటు కాంగ్రెస్, బీఎస్పీలు సత్తా చాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీజేపీకి సీఎం యోగి అదిత్యనాథ్, ఎస్పీకి పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్,కాంగ్రెస్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీఎస్పీకి మాయావతి ప్రచార సారథ్యం వహిస్తున్నారు.
కానీ ఈ పార్టీల తరపున సీఎం అభ్యర్థులు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీటిలో బీఎస్పీ వరకు స్పష్టత ఉన్నా.. మిగతా మూడు పార్టీల తరఫున సీఎం అభ్యర్థుల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ ఇప్పటికే ప్రకటించారు. కాగా తాను పోటీ చేసేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేనని సీఎం యోగి తాజాగా వెల్లడించారు.కాంగ్రెస్ నుంచి ప్రియాంక పోటీపై ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు తావిస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా యోగి
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నందున సీట్లు తగ్గినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే రెండోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుత సీఎం యోగి మళ్లీ ఆ పదవి చేపడతారన్నది సహజంగా వినిపిస్తున్న అభిప్రాయం. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం ఇప్పుడే చెప్పలేనని తాజాగా వ్యాఖ్యానించారు. తాను పోటీ చేయాలా వద్దా.. ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయాలను తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. అప్పటికి ఆయన గోరక్ పూర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.
Also Read : BJP Somu Veerraju – తెలంగాణాలో విజయం… ఆంధ్రాలో ఆనందం !
2017 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత శాసనసభాపక్ష నేతగా ఆయన్ను ఎంపిక చేసింది. దాంతో సీఎం చేపట్టిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. లెక్క ప్రకారం ఆయన పదవీకాలం ఇంకా ఉంది. ఆ పదవితోనే రెండోసారి సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది. కానీ అది మధ్యలోనే పూర్తి అయిపోతుంది. మళ్లీ అసెంబ్లీకో, ఎమ్మెల్సీగానో పోటీ చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థులకు నైతికంగా దన్నుగా ఉంటుంది. నేరుగా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యేందుకు రాజమార్గం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అఖిలేష్ ఎంపీగానే ఉంటే సీఎం అభ్యర్థి ఎవరు?
ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చేశారు. పార్టీ ప్రచార బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తానన్నారు. అలా అయితే ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారన్న సస్పెన్స్ ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆజంగఢ్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన ఆ పదవిలోనే కొనసాగుతారా లేక పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పదవి చేపట్టి ఎమ్మెల్సీగా ఎన్నికవుతారా.. ఇంకెవరికైనా సీఎం పదవి అప్పగిస్తారా అన్నది తేలక ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఉత్కంఠకు గురవుతున్నారు.
ఇక ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని ప్రియాంక గాంధీ కాలికి బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే యూపీ ఎన్నికల ప్రచార ఇంఛార్జిగా ఆమెను ప్రకటించిన పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థి విషయం గానీ.. ప్రియాంక పోటీ చేస్తుందా లేదా అన్నది గానీ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి మరింత ఉత్తేజం వస్తుందని అంటున్నారు. మొత్తానికి పోటీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలో ఒక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రమే ఆ పార్టీ గెలిస్తే సీఎం అవుతారని స్పష్టత ఉంది.
Also Read : Indian Navy – AP Executive Capital : ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖ.. గుర్తించిన ఇండియన్ నేవీ