iDreamPost
iDreamPost
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మహిళా బాంబ్ పేల్చారు. అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. నాలుగు నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం నియోజకవర్గాల్లో మహిళలకే పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఆమె ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇది తన మొదటి హామీ అని చెప్పారు. రాజకీయ స్వార్థంతోనో.. ఇంకేదో అజెండాతోనో ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మహిళా సాధికారత సాధించడం, రాజకీయ అధికారంలో వారికి పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని వివరించారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ప్రియాంక ఆరోపించారు. ఈ తరుణంలో మహిళలను శక్తిమంతులుగా మార్చేందుకు తమ నిర్ణయం దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కుల ప్రాబల్య రాష్ట్రంలో కుదురుతుందా?
ప్రియాంక ప్రకటన యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇది పెద్ద చర్చకు కూడా తావిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో పురుషాధిక్యత అధికంగా కనిపిస్తుంది. దానికితోడు కులాల ప్రాబల్యం ఎక్కువ. ఆ రాష్ట్రంలో ప్రతి అంశాన్ని కులాల ప్రాతిపదికగానే చూస్తుంటారు.. నిర్ణయాలు తీసుకుంటుంటారు. కులాల ప్రతిపదికనే అక్కడ పెద్ద సంఖ్యలో పార్టీలు పుట్టుకొచ్చాయి. పైగా పురుషులే రాజకీయ ఆధిపత్యం చేలాయిస్తుంటారు. ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు తప్ప సామాన్య, మధ్య తరగతి మహిళలు అక్కడ పోటీకి ముందుకు రారు. ఒకవేళ పోటీ చేసినా నెగ్గుకు రాలేని పరిస్థితులే ఉంటాయి. అలాంటప్పుడు మహిళలకు ఎలా అవకాశం ఇవ్వగలరన్నది ప్రశ్న.
యూపీ అసెంబ్లీలో 403 సీట్లు ఉన్నాయి. ప్రియాంక ప్రకటించిన మేరకు మహిళలకు 40 శాతం అంటే.. 160 వరకు స్థానాల్లో వారినే నిలబెట్టాలి. కులం, మతం ప్రాతిపదికన కాకుండా ప్రతిభ, సమర్థతలే కొలమానంగా టికెట్లు ఇస్తామని కూడా ప్రియాంక చెప్పారు. ఆమె చెప్పిన ప్రకారం అంతమంది మహిళా అభ్యర్థులు దొరకడమే కష్టం. దొరికినా కులాల ఆధిపత్యాన్ని పట్టించుకోకుండా నిలబడితే ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మిగిలిన పార్టీలు కచ్చితంగా కుల లెక్కల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేస్తాయి. అటువంటప్పుడు కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ ఎన్నికలతో యూపీలో పూర్వ వైభవం సాధించాలని తపిస్తున్న కాంగ్రెస్‌కు ప్రియాంక సంధించిన మహిళా అస్త్రం అక్కరకు వస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మహిళా బిల్లుకే 11 ఏళ్లుగా మోక్షం లేదు
రాజకీయాధికారంలో మహిళలకు భాగస్వామ్యం, మహిళా సాధికారత వంటివి నినాదాల వరకు బాగానే ఉంటాయి. రాజకీయ పార్టీలు కూడా సందు దొరికినప్పుడల్లా ఈ నినాదాలనే వల్లిస్తుంటాయి. కానీ ఆచరణలో పెట్టవు. పార్లమెంటులో 11 ఏళ్లుగా పెండింగులోనే ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లే దీనికి నిదర్శనం. చట్టసభలైన లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదిస్తూ 108వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. రాజ్యసభలో 2010 మార్చి తొమ్మిదో తేదీన దీనికి ఆమోదం లభించింది.
లోక్‌సభ ఆమోదం పొందితే చట్టరూపం దాల్చేది. కానీ బయట మహిళల పట్ల ఎంతో సానుభూతి, అభిమానం ప్రకటించే అధికార, విపక్ష పార్టీలు లోకసభలో ఈ బిల్లు ఓటింగుకు రాకుండా ఏళ్ల తరబడి అడ్డుకుంటున్నాయి. గతంలో అధికారంలో ఉన్న యూపీఏ, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాలు సభలో తమ కూటములకు మెజారిటీ ఉన్నా బిల్లు ఆమోదానికి చొరవ చూపకుండా కాలక్షేపం చేస్తున్నాయి. మహిళా బిల్లునే పట్టించుకోని పార్టీలు ప్రియాంక ప్రకటనను ఆదర్శంగా తీసుకుని తాము కూడా కులాల లెక్కలు చూడకుండా మహిళలనే పోటీకి పెడతాయనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రియాంక హామీతో సంబరపడి మహిళలు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లు వేసే అవకాశం కూడా లేదు.
Also Read : Jamili Elections -జమిలీ ఎన్నికలకు వచ్చే మే తర్వాతనే స్పష్టత, ఎందుకలా