iDreamPost
iDreamPost
ఉత్తరప్రదేశ్… దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు.. పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రం. దేశానికి ఎంతోమంది ప్రధానులను అందించింది. ఇక్కడ మెజార్టీ స్థానాలు సాధిస్తే ఢిల్లీలో అధికారం హస్తగతమవుతుంది. అటువంటి రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా మోడీ వారుసునిగా హిందూత్వవాదులు ప్రచారం చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. గెలవడమే కాదు..గత మెజార్టీ స్థాయిలో ఫలితాలు రాకుంటే యోగి భావి ప్రధాని అనే ప్రచారానికి ముగింపు పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సర్వేలు ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తుండడంతో యూపీ రాజకీయాలు రసదాయకంగా మారాయి.
ఉత్తరప్రదేశ్‌లో 402 అసెంబ్లీ స్థానాలకు వచ్చే మే నాటికి ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 71 స్థానాలను సాధించింది. దీనివల్లే నరేంద్రమోడీ సారధ్యంలో బీజేపీ కేంద్రంలో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 10 స్థానాలు మాత్రమే రావడం విశేషం. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 62 స్థానాలను కైవసం చేసుకోవడంతో మరోసారి సంపూర్ణ మెజార్టీతో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆపార్టీ ఏకంగా 312 స్థానాలు గెలుచుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ విజయం నల్లేరుమీద నడక కాదనే వార్తలు వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా ఏబీఎన్, సీ` ఓటరు సర్వే ఫలితాలు వచ్చాయి. బీజేపీ తిరిగి అధికారంలో వస్తుందని, కాని సీట్లు గణనీయంగా తగ్గిపోతాయని తేల్చిచెప్పింది. సీ ఓటరు సర్వే ప్రకారం బీజేపీకి ప్రస్తుత పరిస్థితుల్లో 213 నుంచి 221 స్థానాలు మాత్రమే వస్తాయి.అవసరమైన మెజార్టీ సాధించినా గత ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఏకంగా 91 నుంచి 99 స్థానాల వరకు తగ్గనున్నాయి.
Also Read : Kerala Cadre IPS Officer, Gungunata Lakshman Nayak – నాయకుడు అవ్వాలనుకుని.. నిందితుడైన పోలీస్ బాస్!
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 41.4 శాతం ఓట్లు సాధిస్తే, ఈ ఎన్నికల్లో 40.7 శాతం మాత్రమే ఓట్లు సాధించనుంది. సర్వేను పరిశీలిస్తే గత సెప్టెంబరుతో పోల్చుకుంటే వచ్చే సీట్లు, ఓట్లు శాతం నెలనెలకు తగ్గుతుండడం ఇక్కడ గమనార్హం.గత సెప్టెంబరులో 41.8 శాతం ఓట్లుతో 259 నుంచి 267 వరకు సీట్లు వచ్చేవని ఆ సంస్థ అంచనా వేసింది. గత ఎన్నికల కన్నా సీట్లు తగ్గినా ఓట్లు శాతం అధికం కావడం విశేషం. అటువంటిది అక్టోబరు నెల వచ్చే సరికి ఓట్లు శాతం 41.3 శాతానికి, నవంబరులో 40.7 శాతానికి తగ్గనుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.
ఇక సీట్లు విషయానికి వస్తే అక్టోబరులో 241 నుంచి 249కి, నవంబరు నాటికి 213 నుంచి 221కి తగ్గాయి. ఇదే విధంగా తగ్గుదల ఉంటే వచ్చే ఆరు నెలల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశముంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ రాష్ట్రాంలో ఏకంగా 49.98 శాతం ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) పుంజుకోవడం బీజేపీని కలవరానికి గురి చేస్తోంది. బీజేపీ ప్రజాధరణ తగ్గుతుంటే ఎస్‌పీ ఓటింగ్ శాతం పెరుగుతుండడం విశేషం. సీ ఓటరు సర్వే ప్రకారం ఎస్‌పీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 152 నుంచి 160 సీట్లు రానున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఎస్‌పీకి కేవలం 48 సీట్లు మాత్రమే వచ్చాయి. సెప్టెంబరు అంచనా ప్రకారం 109 నుంచి 117 సీట్లు, అక్టోబరు నాటికి 130 నుంచి 138 సీట్లు వస్తాయని సీ ఓటరు అంచనా వేసింది. అంటే ఇక్కడ సీట్లు సంఖ్య నెలనెలా పెరుగుతోంది.
మోడీ తరువాత బీజీపీ పగ్గాలు దక్కేది యోగి ఆదిత్యనాథ్ కే అనే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీని వల్ల రెండవసారి యూపీలో మంచి మెజార్టీతో నెగ్గడం యోగికి తప్పనిసరి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. స్వల్పమెజార్టీతో యోగి గట్టెక్కినా ప్రధాని రేస్‌కు అవరోధం కానుంది. కరుడు గట్టిన నేరస్తులను ఎన్‌కౌంటర్లు చేయడం, కరోనా కట్టడి వంటి విషయాల్లో యోగి పట్ల కొంత సానుకూలత వచ్చినా కేంద్రం ప్రభుత్వ విధానాల మీద సామాన్యులు ఆగ్రహంతో ఉండడం, యూపీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడం వంటి కారణాలతో యోగి ప్రభుత్వం మీద సామాన్యుల ఆశలు తగ్గుతున్నాయి. గడిచిన మూడు నెలలుగా తగ్గుతున్న ఓటింగ్ శాతం ఇలానే కొనసాగిస్తే ఎన్నికల సమయానికి యోగి ఎదురీత తప్పేట్టు లేదని రాజకీయ విశ్లేషకులు భావన.
Also Read : Southern Council Amit Sha -దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం, జగన్ ఎజెండా ఇదే