హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో లోక్‌హిత్ పార్టీ నేత గోపాల్ కందా బీజేపీకి మద్దతు పలకడంపై బీజేపీ ఫైర్‌బ్రాండ్, సీనియర్ నేత ఉమాభారతి ఫైర్ అయ్యారు. నైతిక విలువల పునాదులను బీజేపీ మరిచిపోవద్దని, సచ్ఛీలురైన వారికి మాత్రమే కలుపుకొని వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ‘గోపాల్ కందా కారణంగానే ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడితే, ఆ తర్వాత ఆమె తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమెకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. కేసు కోర్టు విచారణలో ఉంది. ఆ వ్యక్తి (కందా) మాత్రం బెయిలుపై ఉన్నారు’ అని ఉమాభారతి ట్వీట్ చేశారు. గోపాల్ కందా అమాయకుడా, నేరగాడా అనేది సాక్ష్యాల ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుందని, ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన నేరాల నుంచి విముక్తుడైనట్టు కాదని ఆమె అన్నారు. ఎన్నికల్లో గెలుపునకు ఎన్నో కారణాలు ఉంటాయని మరో ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు.
2012లో కందా ఏవియేషన్ కంపెనీలో పనిచేసిన ఓ ఎయిర్‌హోస్టస్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైట్ నోట్‌లోని అంశాలు సంచలనం సృష్టించాయి. కందా వేధింపుల కారణంగానే ఆమె చనిపోయినట్టు ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిలుపై కందా బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు రావడం, ఆయన సైతం తన మద్దతు బీజేపీకేనని ప్రకటించడంతో ఉమాభారతి స్పందనకు ప్రాధాన్యం నెలకొంది.