Idream media
Idream media
శాసన మండలిలో తమ సభ్యత్వాలకు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపీదేవి వెంకటరమణలు చేసిన రాజీనామాలను మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆమోదించారు. ఈ రోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోష్ స్వయంగా తన రాజీనామా లేఖను మండలి కార్యదర్శికి అందించగా.. మరో మంత్రి మోపీదేవి వెంకటరమణ తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఈ రెండు రాజీనామాలను ఆమోదిస్తూ మండలి కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. మండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపీదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎన్నికవడంతో మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మండలి సభ్యత్వాలను రాజీనామా చేసిన వారిద్దరు ఈ రోజు సాయంత్రం మంత్రిపదవులకూ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందిచారు. రాష్ట్ర మంత్రివర్గంలో రెండు బెర్త్‌లు ఖాళీ ఏర్పడ్డాయి. ఈ రెండు బెర్త్‌లను ఎవరితో భర్తీ చేస్తారనే ఆసక్తి ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో మంత్రి పదవులపై చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. వివిధ సమీకరణాల నేపథ్యంలో సీనియర్లతోపాటు జూనియర్లు కూడా తాము రేసులో ఉన్నమనే భావనలో ఉన్నారు.
ఏపీ శాసన మండలి రద్దుకు వైసీపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం, రాష్ట్ర పతి గెజిట్ నోటిఫికేషన్ తర్వాత మండలి రద్దు కానుంది. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కన్నా ముందుగానే ముగిసిన విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో మండలి రద్దు బిల్లు కూడా వస్తుందని అందరూ భావించినా కరోనా ప్రభావంతో సమావేశాలు అర్థంతరంగా ముగియడంతో రాలేదు.
వర్షాకాల సమావేశాల నిర్వహణపై కూడా కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. పరిమిత సంఖ్యలో సభ్యులను ఆహ్వానిచాలని, వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని.. ఇలా పలు రకాల ఆలోచనలను నిన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటోందన్న ఆంచనాలున్నాయి. జాతినుద్దేశించి నిన్న మాట్లాడిన ప్రధాని మోదీ కూడా జూలైలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించారు. అక్టోబర్ వరకూ వైరస్ ఉదృతి కొనసాగుతుందని నిఫుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై క్లారిటీ లేదు.
మండలి రద్దు ప్రక్రియతో సంబంధం లేకుండా ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక నిర్వహిస్తోంది. మార్చిలో డొక్కా మాణిక్య వరప్రసాద్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ తరఫున మండలికి ఎన్నికైన డొక్కా.. ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరారు. ఆ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం గత నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీతరఫున డొక్కా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఆరు నెలల్లోపు ఎన్నికలకు నిర్వహించాల్సి ఉంది. ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అంటే.. వైసీపీ తరఫున మరో ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం వస్తుంది. స్వల్ప కాలమైనా ఆ అవకాశం దక్కించుకునే అదృష్టవంతులెవరో చూడాలి.