అనంతపురం జిల్లా తెలుగుదేశం రోజుకో వివాదంతో రచ్చకెక్కుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోంది. మొన్నటికి మొన్న రాయలసీమ నీటి ప్రాజెక్టుల సాధన పేరుతో జరిగిన సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి నేరుగా పార్టీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డిలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో సభలో రభస చోటుచేసుకుంది. అనంతరం రెండు మూడు రోజులపాటు అదే వివాదాన్ని ఆరోపణలు ప్రత్యారోపణలతో నేతలు పత్రికలు, సోషల్ మీడియా వేదికగా పరస్పరం బురద చల్లుకున్నారు. తాజాగా శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి నియమించిన ద్విసభ్య కమిటీ మరోమారు చిచ్చు రేపింది.
ఎస్సీ నియోజకవర్గంపై వేరే నేతల పెత్తనమేమిటి?
ఎస్సీ నియోజకవర్గమైన శింగనమల టీడీపీలో చాలా కాలంగా గ్రూపుల గోల ఉంది. పార్టీ ఇంఛార్జి బండారు శ్రావణి అందరినీ కలుపుకొని పోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంతోనే నియోజకవర్గ పార్టీ కమిటీలను ఇంతవరకు నియమించలేకపోయారు. కాగా చాలా కాలంగా పెండింగులో ఉన్న అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి 40 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతోపాటు శింగనమల నియోజకవర్గ పార్టీ కమిటీల నియామకాలు, రోజువారీ కార్యక్రమాల బాధ్యతలను ఇద్దరు నేతలు.. ఆలం నరసనాయుడు, ముంటిమడుగు కేసవరెడ్డిలకు కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read : విమర్శలు చేస్తే చర్యలుంటాయని హెచ్చరించే పరిస్థితి టీడీపీకి ఎందుకు వచ్చింది..?
ఇప్పటివరకు పార్టీ వ్యవహారాలు చూస్తున్న శ్రావణిని పక్కన పెట్టడం నియోజకవర్గ నేతలకు నచ్చలేదు. దాంతో వారంతా శ్రావణి నివాసంలో సమావేశమై.. పార్లమెంటు అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి అనంతపురంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కలిశారు. తమ సామాజికవర్గానికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించారు. దాంతో అసహనానికి గురైన శ్రీనివాసులు శివలెత్తారు.
మీ నియోజకవర్గంలో 41 వేల మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలిచింది. మీరా నాకు చెప్పేది అంటూ రెచ్చిపోయారు. చెప్పినట్లు వింటే సరి లేదంటే చర్యలు తప్పవని.. రాజీనామాలు చేస్తామని బెదిరిస్తే ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. దాంతో ఆగ్రహం చెందిన కార్యకర్తలు ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనమేమిటని ప్రశ్నిస్తూ శ్రీనివాసులుపై కుర్చీలతో దాడికి ప్రయత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేయాల్సి వచ్చింది.
చంద్రబాబుకు శ్రావణి ఫిర్యాదు
కార్యాలయం బయట కూడా ఎస్సీ నేతలు పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం గురించి నీతులు వల్లించే నేతలు.. ఆచరణలో విస్మరిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పార్టీ గొడవలు ఉన్నా ఒక్క శింగనమల నియోజకవర్గంలోనే ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నిస్తూ..ఎస్సీ నియోజకవర్గమైనందునే ఇలా చేశారని ఆరోపించారు. కాగా ఈ పరిణామాలపై బండారు శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తూ లేఖ పంపారు. మొన్నటి జేసీ రచ్చ, తాజాగా శింగనమల గొడవలతో అనంతపురం టీడీపీలో ఏం జరుగుతుందో తెలియక సామాన్య కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.
Also Read : అయ్యన్నా.. మరీ ఇంత దిగజారుడా?!