iDreamPost
android-app
ios-app

Logistic Parks – నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెండు లాజిస్టిక్‌ పార్కుల ఉపయోగం ఏమిటి..?

  • Published Dec 11, 2021 | 5:33 AM Updated Updated Dec 11, 2021 | 5:33 AM
Logistic Parks – నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెండు లాజిస్టిక్‌ పార్కుల ఉపయోగం ఏమిటి..?

సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడం, సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రంలో రెండు భారీ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల (ఎంఎంఎల్‌పీ) అభివృద్ధికి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. అనంతపురం, విశాఖపట్నంలలో ఈ పార్కులను నిర్మిస్తారు. ఏపీఐఐసీ, ఆర్‌డీబీ శాఖలు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ ఎఫిషియన్సీ ఎన్‌హాన్స్‌మెంట్‌ ప్రోగ్రాం (లీప్‌) కింద దేశవ్యాప్తంగా 35 మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, గౌహతి, నాగపూర్‌లలో వీటి పనులు ప్రారంభమయ్యాయి.

అనంత, విశాఖలో ఏర్పాటు..

రాష్ట్రంలో విశాఖపట్నం, అనంతపురం వద్ద ఎంఎంఎల్‌పీల ఏర్పాటుకు అపారమైన అవకాశాలున్నాయని సీబీఆర్‌ఈ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. దీంతో ఇక్కడ వీటి ఏర్పాటుకు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్‌ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ పాలసీ 2021–26ను తీసుకువచ్చింది. దానికి అనుగుణంగా ఈ పార్కుల అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తోంది. కాకినాడ, కృష్ణపట్నం వద్ద మరో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు కూడా ప్రణాళికలను తయారు చేస్తోంది.

తగ్గనున్న రవాణా వ్యయం..

రవాణా వ్యయం 8 శాతం తగ్గించడమే లక్ష్యం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వస్తువు ధరలో 13 శాతం కేవలం రవాణాదే. మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ద్వారా రవాణా వ్యయాన్ని 8 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. 100 ఎకరాలు తక్కువ కాకుండా స్థలంలో అన్ని సౌకర్యాలతో వీటిని అభివృద్ధి చేస్తారు. రోడ్లు, రైల్, జల రవాణాతో అనుసంధానం చేస్తారు. తద్వారా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గిస్తారు. ప్రస్తుతం దేశంలో సరుకు రవాణాలో 65 శాతం రోడ్డు మార్గం ద్వారానే జరుగుతోంది. ఇది ఎక్కువ వ్యయంతో కూడుకొన్నది. ఈ ఖర్చు తగ్గించడానికి పారిశ్రామిక తయారీ కేంద్రాల నుంచి చిన్న వాహనాల ద్వారా సరుకును ఎంఎంఎల్‌పీలకు చేరుస్తారు. అక్కడ నుంచి భారీ వాహనాలు లేదా చౌకగా ఉండే జల, రైల్‌ ద్వారా రవాణా చేస్తారు. దీని ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసుకోవచ్చు. ఎంఎంఎల్‌పీల్లో సరుకు నిల్వకు గోదాములు, శీతలీకరణ గిడ్డంగులు, ట్రక్కులు నిలిపే బే ఏరియా, డ్రైవర్లకు వసతులు, రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకులు, కస్టమ్‌ క్లియరెన్సులు, బల్క్‌ లోడింగ్‌ వంటి అన్ని సౌకర్యాలను ఈ పార్కుల్లో అభివృద్ధి చేస్తారు.

Also Read : Central Government – ఏపీ ఎన్నికల్లో పోలవరం-యూపీ ఎన్నికల్లో కెన్-బెత్వా