సామాజిక మాధ్యమాలను ఇటీవల పొలిటికల్ పార్టీలు విపరీతంగా వాడుకుంటున్నాయి. ప్రధానంగా ట్విట్టర్ ను విరివిగా వినియోగిస్తున్నాయి. పార్టీలు, వారి మద్దతుదారులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తమ పార్టీ సిద్దాంతాలు, కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఇతర అంశాలను ప్రచారం చేసేందుకు ఈ మీడియాను వేదికగా మలుచుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ట్విటర్ వినియోగంలో ముందు వరుసలో ఉంటున్నాయి.
వివిధ అంశాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని పార్టీలు ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏదైనా అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లానుకున్నప్పుడు దాని ప్రాధాన్యానికి తగ్గట్టు ఆసక్తికరంగా ఒక హ్యాష్ ట్యాగ్ ను సృష్టిస్తున్నాయి. దాన్ని ట్రెండింగ్ లోకి తీసుకువచ్చేందుకు భారీ సంఖ్యలో ట్వీట్లు చేసేలా ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీ అనుకూల వ్యక్తులు, గ్రూపుల్లో ఇందుకు సంబంధించి ముందుగానే సమాచారం ఇచ్చి, ట్వీట్లు చేయాలని చెబుతుంటాయి. ట్వీట్ల సంఖ్య ఎక్కువ ఉండేలా అంతా సిద్ధం చేసుకున్నాక, ఆ హ్యాష్ ట్యాగ్ తో పోస్టింగులు పెడుతున్నాయి.
రైతు ఉద్యమం నేపథ్యంలో కూడా పలు హ్యాష్ ట్యాగ్ లు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనకు అనుకూలంగా విదేశీయులు వ్యాఖ్యానించడాన్ని దేశంలోని చాలా మంది తప్పుపడుతున్నారు. భారత అంతర్గత విషయాల గురించి బయటి మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా, సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్‌లతో పాటు దేశంలోని చాలా మంది ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
#దుష్ప్రచారాన్ని_భారత్_సాగనివ్వదు (ఇండియా అగైనిస్ట్ ప్రాపగండ) అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఇండియాలో హల్‌చల్ చేస్తోంది. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, శిఖర్ ధావన్, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్, అనిల్ కుంబ్లే, ఆర్‌పీ సింగ్.. సినీ ప్రముఖులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, కరణ్ జోహార్‌లు ఇదే హ్యాష్‌ట్యాగ్‌పై ట్వీట్లు చేశారు. ఇప్పటి వరకు ఈ హ్యాష్‌ట్యాగ్‌పై 5.5 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. దీనితో పాటు మరో హ్యాష్‌ట్యాగ్ కూడా టాప్ ట్రెండింగ్‌లో ఉంది. #ఇండియా_టుగెద్ (ఐక్యంగా భారత్) అనే హ్యాష్‌ట్యాగ్‌పై కూడా 5.5 లక్షల ట్వీట్లు వచ్చాయి. ఇప్పుడు ట్విటర్, హ్యాష్ ట్యాగ్ లు విస్తృత ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఓ రకంగా మున్నెన్నడూ లేని స్థాయిలో సామాజిక మాధ్యమంగా వేలకొద్దీ అనుకూల, ప్రతికూల పోస్టులతో ట్విటర్ హోరెత్తడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న ఆందోళనకు సంబంధించి కేంద్రం 257 యూఆర్‌ఎల్‌లను, ఒక హ్యాష్‌ట్యాగ్‌ను స్తంభింపజేయాల్సిందిగా సామాజిక మాధ్యమం ట్విటర్‌ను సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. కిసాన్ ఏక్తా మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్), అనేక రైతుయూనియన్లు, ప్రజా హక్కుల కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ, సీపీఎంల నేతలు, కారవాన్ మేగజైన్, ప్రసార్ భారతి సీఈవో వెంపటి శశి శేఖర్… మొదలైన సంస్థల, వ్యక్తుల ఖాతాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశాలను వెంటనే అమలు పరిచినా 24 గంటల లోపే వీటిని ట్విటర్ పునరుద్ధరించింది. ఆదేశాలను కొనసాగించలేమని స్పష్టం చేస్తూ సమాధానం పంపింది. దీంతో కేంద్రం భగ్గుమంది.
ముఖ్యంగా- ‘మోదీ ప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌పై తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ- ఖాతాలను, హ్యాష్‌ట్యాగ్‌లను వెంటనే తొలగిస్తారా లేక చర్య తీసుకోమంటారా అని తీవ్ర హెచ్చరిక చేస్తూ ట్విటర్‌కు ఓ 18- పేజీల నోటీసును సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పంపింది. ఇలా మొత్తమ్మీద హ్యాష్ ట్యాగ్ ల ప్రచారం ఇప్పుడు హాట్ ట్రెండింగ్ గా మారింది. రాజకీయ పార్టీలు, మద్దతు దారులు ఇప్పుడంతా ఇదే ఫాలోఅవుతున్నారు.