iDreamPost
iDreamPost
నిన్న ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన అఖండ టీజర్ బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. వీడియో చిన్నదే అయినప్పటికీ ఉన్న కాసిన్ని ఫ్రేమ్స్ లోనూ తమ హీరో నెవర్ బిఫోర్ అవతారాన్ని చూసి వాళ్లకు గూస్ బంప్స్ వచ్చాయి. లెజెండ్ తరహా ఇంటర్వల్ బ్యాంగ్ ఇందులోనూ కనిపిస్తోంది. బోయపాటి శీను బ్రాండ్ మాస్ హీరోయిజంతో పాటు నంది ముందు పంది గెంతులా అంటూ ప్రాసతో కూడిన డైలాగులు కూడా ఉన్నాయి. ఇలాంటి రిస్కీ గెటప్స్ గతంలోనూ బాలయ్య చేసినప్పటికీ ఇప్పటి జెనరేషన్ చూసిన ఆయన సినిమాల్లో మాత్రం ఇలా కనిపించలేదు అందుకే దీన్ని కొత్తగా ఫీలవుతున్నారు.
నిజానికి బోయపాటి ముందు అనుకున్నది ఇంకా సహజంగా ఉండే అఘోరా వేషం. లాక్ డౌన్ కు ముందు బాలకృష్ణ దీని కోసమే జుత్తు తీసేసి మరీ షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత రషెస్ చూసుకున్నాక ఎందుకో పూర్తి సంతృప్తి కలగక నిర్ణయం మార్చుకుని ఇప్పుడు చూసిన గెటప్ లోకి తీసుకొచ్చారు. దీని ఫోటో షూట్ కి యూనిట్ తో పాటు హీరో దర్శకుడి టీమ్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో ఫైనల్ గా దీనికి ఫిక్స్ అయ్యారు. అయినా బాలయ్య ఇలా త్రిశూలం పట్టుకుని ఎక్కడో చీకటి గుహలో శివుడిని కొలుస్తూ ఏం చేస్తున్నాడో లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదలయ్యే దాకా ఆగాలి.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందు ప్రకటించిన మే 28ని నిన్న టీజర్ లో ఖరారు చేయలేదు. కొద్దిరోజులు అయ్యాక అప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పూర్ణ, విలన్ గా శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక పాత్ర ఐఏఎస్ ఆఫీసర్ గా మరో క్యారెక్టర్ నిన్న చూసిన గెటప్ లో ఉంటుందట. ఈ ఇద్దరు లెజెండ్ లాగా కలుసుకునే సన్నివేశాలు ఉంటాయా లేక సింహా తరహాలో ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఒకటి రివీల్ చేస్తారా లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. తన మీద అంచనాలకు మించి రాణిస్తున్న తమన్ దీనికి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందుకు తగ్గట్టే ఇవ్వడం పాజిటివ్ అని చెప్పొచ్చు