Idream media
Idream media
కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలకు వారి పరిస్థితికి ఏ మాత్రం పొంతన ఉండదు. అందుకే వారి మాటలు వినే వారికి హాస్యాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీటర్లను తీసివేస్తామని ప్రకటించారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చారు.
తులసి రెడ్డి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో హాస్యాన్ని పండించేందుకు నెటిజన్లు ఉపయోగిస్తున్నారు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందన్న చందంగా.. ఉనికే లేని కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందని తులసి రెడ్డి చెబుతున్నారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేయడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఏపీ ప్రజలు బంగాళాఖాతంలో కలిపారు. కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. 2019 ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకలేదు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 1.17 శాతం మాత్రమే. ఇది కూడా హస్తం గుర్తుకే ఓటు వేసే సాంప్రదాయ ఓటర్ల పుణ్యమే. ఇలాంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తులసి రెడ్డి పగటి కలలు కంటున్నారా..? అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి రావడం తరువాత.. 2024లోనైనా అసెంబ్లీలో కనీసం ప్రాతినిధ్యం కోసమైనా ప్రయత్నించాలని సలహాలు కూడా ఇస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలతోపాటు మెరుగైన విద్యుత్ అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను అమర్చాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ హడావుడి చేస్తున్నాయి. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకే ఇలా చేస్తున్నారని కూడా ఆరోపించాయి. అందరి అనుమానాలను జగన్ సర్కార్ తీర్చింది. అయినా ఉచిత విద్యుత్, మీటర్ల ఏర్పాటుపై మాత్రం రాజకీయాలు ఆగడం లేదు.
ఈ రాజకీయాల్లో భాగంగానే తులసి రెడ్డి మరో అడుగు ముందుకువేశారని ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉండడంతోనే తులసిరెడ్డి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం తులసిరెడ్డి తెలివిగా ఇలా మాట్లాడారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాగైనా ప్రజలు, మీడియా, సోషల్ మీడియాలో ఉండాలనే లక్ష్యంతోనే తులసిరెడ్డి ఇలా మాట్లాడి ఉంటారని కామెంట్ చేస్తున్నారు.