Idream media
Idream media
తిరుమల…హిందువుల ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం. ఏడాదికి కనీసం ఒక్కసారైనా తిరుమలకు వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని అనుకుంటారు. కాని ఈ ఏడాది డిసెంబర్‌లో ఆ రెండురోజుల్లో తిరుమలకు రావడం వాయిదా వేసుకోవడం మంచిదని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఆ రెండు రోజులు ఏవంటే డిసెంబర్ 25,26. ఈ రెండు రోజుల్లో తిరుమలకు ఎందుకు రాకపోవడం మంచిదో తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిరంతరాయంగా 13 గంటల పాటు మూసివేస్తారు. డిసెంబర్ 25న రాత్రి మూతపడ్డ ఆలయం మరుసటి రోజు అంటే 26వ తేదీ మధ్యాహ్నం తిరిగి భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు తలుపులు తెరుస్తారు. సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రెండురోజుల్లోనూ సూర్యగ్రహణం ఉంటుంది.
25 నుంచి సూర్యగ్రహణ ప్రభావం ఆలయంపై పడనుంది. డిసెంబరు 26న గురువారం ఉదయం 8.08 నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం గ్రహణ ప్రారంభానికి తొమ్మిది గంటల ముందుగా అనగా డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ ముఖద్వార తలుపులు మూసివేస్తారు.
డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ఆలయశుద్ధి చేస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఈ విషయాలను భక్తులు గమనించాల్సి ఉంది. ఈ రోజుల్లో తిరుమలకు రావాలనుకునే వారు ఈ విషయాలను గమనంలో పెట్టుకుని యాత్రకు ప్లాన్ చేసుకుంటే సమయం కలసి వస్తుందని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.