టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు మళ్లీ శ్రీవారి సేవ చేసుకునే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పించింది. అయితే ఈ దఫా ఆగమ సలహా మండలి సభ్యునిగా ఆయన తిరుమలలో కొలువుదీరనున్నారు. ఈ మేరకు ఆయనకు రెండురోజుల క్రితం టీటీడీ ఉత్తర్వులిచ్చింది. కొత్తగా నియమితులయ్యే అర్చకులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ తగిన మార్గనిర్దేశం చేయడానికి ఆయన సేవలను వినియోగిస్తారు. కాగా ప్రధాన అర్చకుడిగా తొలగిస్తూ నాడు టీటీడీ ఈఓ అశోక్‌సింఘాల్ ఉత్తర్వులిచ్చారో…అదే ఈఓ నేతృత్వంలో తిరిగి నియామక ఉత్తర్వులు కూడా దక్కించుకోవడం గమనార్హం. ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు తొలగింపు, తిరిగి నియామకం నేపథ్యంలో ఆయన గురించి ప్రత్యేక కథనం.
ఏవీ రమణదీక్షితులకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే అమితాసక్తి. తిరుపతిలోనే ఆయన విద్యాభ్యాసం సాగింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన మైక్రో బయాలజీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన రాసిన అనేక జర్నల్స్ నేటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వంశపారంపర్యంగా వచ్చిన అర్చకత్వంలోకి ఆయన ప్రవేశించారు.
బాబు సర్కార్‌తో రమణదీక్షితుల వైరానికి ప్రధానంగా చెన్నై వేదికైంది. 2018, మే 15న రమణదీక్షితులు చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబు సర్కార్‌తో పాటు టీటీడీ అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. అర్చక వారసత్వాన్ని రద్దు చేయడం ఆగమశాస్త్ర విరుద్ధమని టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు అన్నారు. హిందూ మతాన్ని కనుమరుగు చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. తిరుమలలో భక్తులకు శ్రీవారి సేవ దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నియమనిబంధనలు తెలియని వారిని అధికారులుగా నియమించి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే తిరుమల శ్రీవారి ఆభరణాల వివరాలు తెలియవన్నారు. ఆభరణాల వివరాలు, ఆలయ లెక్కలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా వారు, రాజకీయ నాయకుల ప్రాపకం కోసం భజన చేస్తూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు వారి కాలంలో శ్రీవారికి సమర్పించిన ఆభరణాలు ఉన్నాయో లేదో అనే అనుమానం వ్యక్తం చేశారు.
హుండీ ఆదాయం స్వామి వారి కోసం మాత్రమేనని, అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన ఊరిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.10 కోట్లు అడుగుతున్నారంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికార పక్షం కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి నుంచి ఆలయాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడుతూనే ఉంటామన్నారు. తమతో పాటు భక్తులు కూడా స్వామివారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన పిలుపునిచ్చారు.
చరిత్ర తెలియని ఆలయ పాలకమండలి, అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ట మంటగలుస్తోందన్నారు. తిరుమల ఆలయంలో సాగుతున్న వ్యవహారాలపై సీబీఐతో విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ నేతృత్వంలో మే 16న తిరుమలలో పాలకమండలి సమావేశమైంది. ప్రధానంగా ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తొలగింపే ఎజెండాగా సమావేశం సాగింది. టీటీడీలో అర్చకుల గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లగా నిర్ణయించి రమణదీక్షితులతో పాటు మరో ముగ్గురిని తొలగిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకొంది.
ప్రధాన అర్చకుడితో పాటు మరో ముగ్గురిని తొలగిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. హైందవ సంప్రదాయాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి వంశపారంపర్యంగా దేవుడి సేవా విధుల్లో పాల్గొంటున్న వారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వం ద్వారా నియమితులైన టీటీడీ పాలక మండలికి ఉందా అనే చర్చ సర్వత్రా జరిగింది. ఒక విధంగా చంద్రబాబు సర్కార్ ఆత్మరక్షణలో పడింది.
టీటీడీ పాలకమండలిలో ప్రధాన అర్చకుడిని తొలగింపు నిర్ణయం తీసుకున్న తర్వాత నోటీసును రమణదీక్షితులకు అందజేసేందుకు టీటీడీ అత్యుత్సాహం ప్రదర్శించింది. రమణదీక్షితులు ఊళ్లో లేరని తెలిసినప్పటికీ, ఆయన వచ్చేంత వరకు వేచి చూసే ధోరణితో వ్యవహరించలేదు. బకాయి పడ్డ వారి ఇంటికి బ్యాంకులు నోటీసులు అంటించినట్టుగా, రమణదీక్షితులు ఇంటి గోడకు తొలగింపు ఉత్తర్వులు అంటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. టీటీడీ వ్యవహార శైలిపై రమణదీక్షితులు తీవ్ర మనస్తాపం చెందారు. సహజంగా టీటీడీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు శ్రీవారి బంగారు డాలర్ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులందరికి దర్శనం చేయించి గౌరవంగా సాగనంపుతారు. కాని రమణదీక్షితుల విషయంలో అలాంటి మర్యాదలు పాటించక అవమానకర రీతిలో వెళ్లగొట్టారు. కాగా తొలగింపు నోటీసులో గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాలదీక్షితులను ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.
తనను తీవ్రంగా అవమానిస్తున్న బాబు సర్కార్‌తో పాటు టీటీడీపై రమణదీక్షితులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వారితో తాడోపేడో తేల్చుకోవాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2017 డిసెంబర్‌లో ఎలాంటి సమాచారం లేకుండా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి వంటశాలను మూసి వేశారన్నారు. 25 రోజుల పాటు శుచిగా లేని నైవేద్యాన్ని స్వామివారికి పెట్టారన్నారు.
వంటశాల వద్ద భూకంపం వచ్చిన మాదిరిగా అక్కడ గోడలు, ఇటుకలు పడిపోయి ఉన్నాయన్నారు. పదో శతాబ్దంలో చోళులు, పల్లవులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల కోసం అక్కడ తవ్వకాలు జరిపినట్టు ఆనవాళ్లు తెలియజేస్తున్నాయన్నారు.
అలాగే 2001లో గరుడసేవ సందర్భంగా స్వామివారికి సమర్పించిన ప్లాటినం హారం మధ్యలో ఉండే గులాబీ రంగు వజ్రం భక్తులు విసిరిన నాణేల వల్ల పగిలిపోయిందని రికార్డు చేశారని ఢిల్లీ విలేకరుల సమావేశంలో దీక్షితులు ఆన్నారు. అయితే ఇటీవల జెనీవాలో అలాంటి వజ్రమే రూ.500 కోట్లకు అమ్ముడైందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వజ్రం కనిపించకుండా పోవడం, ఇతరత్రా లోటుపాట్ల గురించి బయట పెట్టినందుకే తనపై కక్ష తీర్చుకుంటున్నారని ఆయన విమర్శించారు.
టీటీడీపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధాన అర్చకుడు దీక్షితులతో పాటు ఆయన ఆరోపణలను బలపరుస్తూ మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీటీడీ రూ.100 కోట్ల పరువునష్ట దావాను తిరుపతి కోర్టులో వేసింది. కాగా రమణదీక్షితుల వెనుక బీజేపీ, వైసీపీ ఉందని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా అమిత్‌షా తిరుమలకు వచ్చి వెళ్లిన తర్వాతే రమణదీక్షితుల వైఖరిలో మార్పు వచ్చిందనేది వారి ఆరోపణ. ఒక దశలో టీటీడీతో పాటు బాబు సర్కార్ వైఖరికి నిరసనగా తిరుపతిలో నిరశనకు దిగుతానని రమణదీక్షితులు హెచ్చరించడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేసి నివేదిక ఇచ్చేందుకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ హైకోర్టుకు 2018, జూన్ 27న రాష్ర్ట ప్రభుత్వం లేఖ రాసింది. జూన్‌లో ఆగమసలహాదారుడిగా ఉన్న రమణదీక్షితులపై ప్రభుత్వం వేటు వేసింది. అలాగే వందకోట్ల పరువు నష్టానికి సంబంధించి నోటీసులను కూడా టీటీడీ పంపింది. దీక్షితుల తరపున ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో కేసు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరువు మరింత బజారుపడుతుందనే భయంతో అప్పట్లో బాబు సర్కార్ రెండు నెలల ఆలస్యంగా దీక్షితుల ఆరోపణలపై స్పందించింది. అయినప్పటికీ హైకోర్టు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
అర్చకుడిగా కాకుంటే సైంటిస్ట్ అయ్యిండేవాడినని దీక్షితులు చెబుతుంటారు. రమణదీక్షితులు అసలు ఆలయ ప్రధాన అర్చకుడు ఎలా అయ్యారో తెల్సుకొందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఆలయాల్లో మిరాశీ వ్యవస్థ ఉండేది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మిరాశీ వ్యవస్థను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థగా పేరు గాంచిన టీటీడీలోనూ మిరాశీ వ్యవస్థకు ముగింపు పలికారు.
అయితే అంత వరకు మిరాశీ వ్యవస్థలో ఉన్న అర్చకులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక జీఓ తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం నాలుగు ప్రధాన అర్చక, నాలుగు ముఖ్య అర్చక, 43 అర్చక పోస్టులను సృష్టించింది. ఈ పోస్టుల్లో అప్పటి వరకు మిరాశీ వ్యవస్థలో పనిచేస్తున్న అర్చకులను నియమించాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. మిరాశీ వ్యవస్థలో నాలుగు కుటుంబాలు ఉండేవి. అవి
1.గొల్లపల్లి 2.పెద్దింటి 3.పైడిపల్లి 4.తిరుపతమ్మ. ఈ కుటుంబాల్లో పైన పేర్కొన్న వాటిలో ఎవరెవరు ఏ పోస్టుకు అర్హులో గుర్తించి అందులో నియమించింది.
గొల్లపల్లి కుటుంబంలో ఎ.వెంకటరమణదీక్షితులు, ఎ.సుందరరామదీక్షితులను మొదటితరం వారిగా టీటీడీ గుర్తించింది. వీరిలో వెంకటరమణ దీక్షితులు తన కుమారుడిగా రమణదీక్షితులను దత్తత తీసుకున్నారు. మిగిలిన వారి అర్హతలను బట్టి పొజీషన్ ఇచ్చారు. రమణదీక్షితులను తొలగించిన తర్వాత గొల్లపల్లి కుటుంబం నుంచే వేణుగోపాలదీక్షితులను టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియమించింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా శ్రీవారికి సేవలందించిన రమణదీక్షితులు మరోసారి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆగమ సలహా మండలి సభ్యుని రూపంలో తిరుమలలో అడుగు పెట్టారు.
1996లో మిరాశీ వ్యవస్థను నాటి రాష్ర్ట సర్కార్ రద్దు చేసింది. దీనిపై అర్చకులు సుప్రీంకోర్టు గడప తొక్కారు. బహుమానాలు, మర్యాదల్లో టీటీడీ వంశపారంపర్య అర్చకులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వంశపారంపర్య అర్చకత్వంలో టీటీడీకి వేలు పెట్టే అధికారం లేదన్నది రమణదీక్షితుల వాదన.
ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణదీక్షితులు నియామకంపై కొన్ని ప్రజాసంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. శ్రీవారి వజ్రాన్ని జెనీవాలో రూ.500 కోట్లకు విక్రయించడంతో పాటు తిరుమలలో ఆభరణాల కోసం తవ్వకాలు జరిపారని తీవ్ర ఆరోపణలు చేసిన రమణదీక్షితులును ఎలా నియమిస్తారని ఆయా సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు దీక్షితులపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు నడుస్తుండగా తిరిగి తీసుకోవడం ఏం న్యాయమని నిలదీస్తున్నారు. మరోవైపు తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ శ్రీవారికి సంబంధించి ఎలాంటి ఆభరణాలు పోలేదని చెప్పారన్నారని గుర్తు చేస్తున్నారు. రమణదీక్షితులను నియమించిన నేపథ్యంలో కనీసం పరువు నష్టం కేసునైనా టీటీడీ ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.